కాళ్ల: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైన ఘటన కాళ్ల మండలం ఎల్‌ఎన్ పురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాళ్ళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కోమటిలంకకు చెందిన చెన్నకేశవ అరవింద్(22), ప్రత్తికోళ్లలంక కు చెందిన బండి జాన్ యేసు ఇద్దరూ బంధువులు. కొంతకాలం క్రితం కాళ్ళ మండలం ఎల్‌ఎన్ పురం గ్రామంలోని చెరువుల వద్దకు జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వీరు పనిచేసే చెరువుల వద్ద కిరణ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురు పనిచేస్తున్న చెరువుపై మద్యం సేవించారు. మద్యం మత్తులో బంధువులైన జాన్ యేసు, అరవింద్ ఘర్షణకు దిగారు.
అనంతరం జరిగిన దాడిలో జాన్ యేసు మేతబస్తాలపై ఉన్న చాకుతో అరవింద్ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అరవింద్‌ని పక్కనే ఉన్న కిరణ్ వేరే వ్యక్తి సహాయంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు అరవింద్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కుక్కునూరు : బైక్ అదుపు తప్పి ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కునూరు ఎస్సై రామక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుకుమకు చెందిన నందా(35), ఉంగా రామ్(29) సోమవారం మధ్యాహ్నం బైక్‌పై భద్రాచలం నుంచి కుక్కునూరులో బంధువుల ఇంటికి వస్తుండగా బంజరగూడెం మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నందా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన ఉంగారామ్‌ను అమరవరం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
యథేచ్ఛగా కంకర తరలింపు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెత్తప్రాంతంలో మట్టి, కంకర మాఫియా ముఠా పడగ విప్పింది. రెండు రోజులనుంచి వందలాది లారీలతో యథేచ్ఛగా కంకరను లంబాడీ గూడెం నుంచి పెంటపాడు మండలం అలంపురంనకు తరలిస్తున్నారు. అలాగే బాదంపూడికి చెందిన కూటమి నాయకుడు పోలవరం కాలవగట్టు కంసాలిగుంట నుంచి పోలవరం కాలవగట్టు తవ్వి కంకరను తరలిస్తున్నుట్ల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొల్లగూడెం ప్రాంతంలో కుడిగట్టు కంకర గుట్టలు, నాచుగుంట అయకట్టులో మట్టి తరలింపు పనులు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్‌ను ప్రశ్నించగా కంకర తరలింపు పనులు నిలుపుదల చేసినట్లు తెలియజేశారు.