
వీర జవాన్లకు ఘన నివాళి
ఏలూరు టౌన్: దేశం కోసం వీర మరణం పొందడం పూర్వజన్మ సుక్రుతమని, దేశంలోని జవానుల త్యాగాలు మరువలేమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా వీర మరణం పొందిన అమరవీరులు జవాన్ మురళీ నాయక్, వాయుసేనలో మెడికల్ ఆఫీసర్ సురేంద్రకుమార్‌కు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జవానుల త్యాగాలను డీఎన్నార్, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నల జాన్‌గురునాథ్, నెరుసు చిరంజీవి, కేసరి సరితా రెడ్డి, తేరా ఆనంద్, నూకపెయ్యి సుధీర్‌బాబు, షేక్‌బాజీ, బాస్కర్ల బాచి, జిజ్జువరపు విజయనిర్మల, కిలాడి దుర్గారావు, కంచుమర్తి తులసీ, బుద్దల రాము, పాతినవలస రాజేస్, స్టాలిన్, షమీమ్, వైస్ ఎంపీపీ టీ,గిరిజ తదితరులు ఉన్నారు.
భూవివాదంలో జనసేన శ్రేణులు
కొయ్యలగూడెం: భూవివాదంలో జనసేన పార్టీ శ్రేణుల వ్యవహారంపై స్థానికులు ఎమ్మెల్యేని చుట్టుముట్టి తమపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించిన ఘటన కొయ్యలగూడెంలో సోమవారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన శ్రేణులను మందలించడం కనిపించింది. తహసీల్దార్ కే చెల్లన్న దొరతో కలసి కొయ్యలగూడెంలోని వివాదాస్పద భూమి వద్దకు వచ్చిన ఆయన జాతీయ రహదారికి పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆ భూమి వివరాలను పరిశీలించారు. స్థలం తమదంటూ బయటి వ్యక్తులు వచ్చారని, వారికి మద్దతుగా జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. తమ పార్టీలోని కొందరు తనకు తెలియకుండా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగించబోమని ఎమ్మెల్యే చెప్పారు. అదే సమయంలో వివాదానికి సంబంధించిన వ్యక్తుల్లో ఒకరు ఎమ్మెల్యే సమక్షంలో అక్కడే ఉండటం.. అతనిపై మహిళలు దాడికి యత్నించడం గమనార్హం. ఈ క్రమంలో ఎస్సై వి.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

వీర జవాన్లకు ఘన నివాళి