
కోకో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా వ్యత్యాసపు ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు సోమవరప్పాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోండలీజ్ కంపెనీ కార్యాలయం, గోడౌను వద్ద కోకో రైతుల ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏలూరు అన్నే భవనంలో సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకుండా కంపెనీలు కోకో రైతులను నిలువు దోపిడీ చేయడం దారుణమని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్. గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఏబీఎస్ ప్రకాశరావు, యలమాటి విశ్వేశ్వరరావు, ఏ.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.