
విద్యాసంస్థల పేరుతో ఘరానా మోసం
లింగపాలెం: గంధం సాంబశివరావు అనే వ్యక్తి విద్యా సంస్థలను అప్పజెప్పినట్లుగా చూపి రూ.70 లక్షలు వసూలు చేసి తనను మోసం చేశారని సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ కోసూరి సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివారులో బాధితురాలు సుజాత విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. బాబా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో గంధం సాంబశివరావు కాలేజీ నడిపే వారు. ఆ కళాశాలలో సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వం అనుమతితో ధర్మాజీగూడెం శివారు వలసపల్లి అడ్డరోడ్డులో ఉన్న బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడి వద్దకు తాను వెళ్లిపోతున్నాని, కాలేజీ తీసుకోమని నన్ను అడిగారు. బాబా ఎడ్యుకేషన్ సొసైటీ అనుమతులను సాయి జూనియర్ కళాశాలగా ధర్మాజీగూడెం శివారులో కొత్తగా నిర్మించిన బిల్డింగ్, ఫర్నీచర్‌తో సహ ఐదేళ్లు వాడుకునే విధంగా పెద్దల సమక్షంలో సాంబశివరావుకు రూ.70 లక్షలకు లీజు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏడాదికి రూ.11 లక్షలు అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ సమయంలో రూ. 40 లక్షలు సాంబశివరావుకు ఇవ్వగా మిగిలిన రూ. 30 లక్షల నిమిత్తం డిగ్రీ కాలేజీ అనుమతులు వేరే వారికి ఇచ్చి ఆ వచ్చిన సొమ్మును సాంబశివరావుకు చెల్లించాను. కాగా సాంబశివరావు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి వేరే పేర్లతో బినామీగా వనిత జూనియర్ కళాశాల, క్రిసైల్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అనుమతులు తీసకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను మోసం చేసిన గంధం సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు సుజాత తెలిపారు.
గూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని జగన్నాథపురం, మాధవరం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లోని చెరువులను జేసీబీల సాయంతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
● రూ.70 లక్షలు తీసుకుని నన్ను బురిడీ కొట్టించారు
● సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ సుజాత ఆవేదన