
విడదల రజినిపై దౌర్జన్యం సిగ్గుచేటు
ఏలూరు టౌన్: మాజీ మంత్రి, బీసీ మహిళా నేత విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటని.. కక్షసాధింపు రాజకీయాలతో కూటమి ప్రభుత్వం బిజీగా ఉందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, బీసీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కక్ష సాఽధింపు చర్యలు వెర్రితలలు వేస్తున్నాయని, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను అణచివేయాలనే కుట్రలకు తెరదీశారని విమర్శించారు. భారత ప్రభుత్వం, దేశంలోని ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుబెట్టాలనే సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలుపుతూ ఉంటే.. కూటమి సర్కారు మాత్రం ప్రతిపక్ష నేతలపై ఎలా కక్ష సాధించాలనే అంశంపై దృష్టి పెట్టడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి అసత్యాలను ఆరోపణలుగా మార్చి దాని చుట్టూ కక్ష తీర్చుకునేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కాలం ఒకేలా ఎప్పుడూ ఉండదనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని, పరిస్థితులు తిరగబడితే రేపు ఇదే పద్ధతులు అనుసరించాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఏడాది గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతోందన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కేవలం రాక్షస పాలన సాగుతుందని, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయటమే ధ్యేయంగా పాలన చేస్తూ ప్రజలను మాత్రం తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత గౌరవం లేదని.. బీసీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినిపై ఏకంగా పోలీసులు దౌర్జన్యం చేయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనన్నారు. రాష్ట్ర వడ్డీలు విభాగం అధ్యక్షుడు ముంగర సంజీయ్‌కుమార్ మాట్లాడుతూ.. బీసీ మహిళా నేత విడదల రజినిని టార్గెట్ చేస్తూ ఆమె రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కక్షసాధిస్తూ కేసులు పెట్టటం దారుణమన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లక్షల కోట్లు అప్పులు చేయడం సంపద సృష్టించటమా? అంటూ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ.. మాజీ మహిళా మంత్రిపై పోలీస్ అధికారి దౌర్జన్యానికి పాల్పడడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని చాటుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు హామీ ఏమైందో చెప్పాలన్నారు. అమ్మకు వందనం అంటూ.. కేవలం నాన్నకు ఇంధనం మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్‌బాజీ, వాణిజ్య సెల్ కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
హామీలు గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలు
తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు