పంచాయతీ ఆస్తుల పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఆస్తుల పరిరక్షణ

May 12 2025 12:38 AM | Updated on May 12 2025 12:38 AM

పంచాయతీ ఆస్తుల పరిరక్షణ

పంచాయతీ ఆస్తుల పరిరక్షణ

భీమవరం(ప్రకాశం చౌక్‌): ఆక్రమణల చెరలో ఉన్న గ్రామ పంచాయతీల భూములు, ఆస్తుల పరిరక్షణకు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగనుంది. ఇటీవల కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి జిల్లాలో హైపర్‌ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పంచాయతీ భూమి, ఆస్తులు ఆక్రమణలను గుర్తించడం, వాటిని తొలగించడం, బాధ్యులపై కేసులు నమోదు తదితర చర్యలపై హైపర్‌ కమిటీకి సృష్టమైన అదేశాలు ఇచ్చారు. పంచాయతీ భూమి ఆక్రమణను గుర్తించిన వెంటనే పోలీసుల సహకారంతో పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగిస్తారు. సమస్యలు తలెత్తితే హైపర్‌ కమిటీలోని అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రతి మూడు నెలలకోసారి హైపర్‌ కమిటీ సమావేశమై ఆక్రమణల గుర్తింపు, తొలగింపు పురోగతిని సమీక్షిస్తుంది. అలాగే ప్రతినెలా డివిజన్‌ పంచాయతీ అధికారి సమీక్షిస్తారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా రెండు నెలలకు ఓసారి జిల్లా పంచాయతీ అధికారి కేసులను సమీక్షిస్తారు.

జిల్లాలోని 409 పంచాయతీల్లో..

పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీలు ఉండగా.. పలు ప్రాంతాల్లో పంచాయతీల ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. పంచాయతీ భూములు, చెరువులు, డ్రెయిన్లను ఆక్రమించుకుని ఇళ్లు, షాపుల నిర్మాణం, లేఅవుట్లలోని పంచాయతీ భూమిని కలుపుకుని ప్లాట్‌ వేసి విక్రయించడం, పంచాయతీకి చెందిన భూమి పాడుకుని పాట చెల్లించకుండా స్వాధీనం చేసుకోవడం వంటి అతిక్రమణలు ఉన్నాయి.

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు

ప్రతి సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో పంచాయతీల్లో ఆక్రమణలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో ప్రతివారం మూడు, నాలుగు పంచాయతీల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో హైకోర్టు ఉత్తర్వులతో జిల్లా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పంచాయతీకి చెందిన ఆస్తులు, భూములను మూడు వర్గాలుగా విభజించారు.

పంచాయతీ ఆస్తుల వర్గీకరణ

ఏ కేటగిరీ : సొంత, భూసేకరణలోని ఆస్తులు, సాధారణ రోడ్లు, డ్రెయిన్లు, పశువుల షెడ్లు, సాధారణ మార్కెట్‌ ప్రాంతాలు, లేఅవుట్లలోని 10 శాతం ఖాళీ స్థలాలు, పార్కులు, పంచాయతీ కొనుగోలు చేసిన భూములు.

బీ కేటగిరీ : బహమతులు, విరాళాలు, పంచాయతీలకు భూముల బదిలీ ద్వారా వచ్చిన ఆస్తులు తదితరాలు.

సీ కేటగిరీ : పంచాయతీల్లోని వాటర్‌ వర్క్స్‌, రిజర్వాయర్లు, ట్యాంకులు, సిస్టర్న్‌లు, ఫౌంటేన్లు, బావు లు, పైపులు, పంచాయతీరాజ్‌ చట్టంలోని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు, ట్యాంక్‌ బండ్‌లు, నీటివనరులు, పోరంబోకు భూములు (మేత భూములు, నూర్పిడి అంతస్తులు), శ్మశాన వాటికలు, పశువుల స్టాండ్లు, బండి స్టాండ్లు. ఏ, బీ కేటగిరీల రక్షణ బాధ్యత పంచాయతీలది కాగా.. సీ కేటగిరీ రక్షణ బాధ్యత పంచాయతీతో పాటు రెవెన్యూ శాఖది.

రోడ్లు, కాలువ గట్ల ఆక్రమణలపై సర్వే

పంచాయతీ పరిధిలోని ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా, కాలువలు, డ్రెయిన్ల ఆక్రమణలపై సర్వే చేసి జాబితా రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అధికారులు సర్వే పనులు చేపట్టారు.

హైపర్‌ కమిటీ

హైపర్‌ కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి, ఇరిగేషన్‌, సర్వే, ఆర్‌ అండ్‌ బీ, మైనింగ్‌ తదితర శాఖల జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారు.

పారదర్శకంగా సాధ్యమేనా?

పంచాయతీల్లో ఆక్రమణలు తొలగింపు అధికారులకు సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు తొలగింపులకు అడ్డుపడితే అధికారులు ముందుకు వెళ్లగలరా అన్నది అనుమానమే. పంచాయతీ ఆస్తుల పరిరక్షణలో కలెక్టర్‌, హైపర్‌ కమిటీ ఈ మేరకు విజయవంతం అవుతారో వేచి చూడాలి.

హైకోర్టు ఆదేశాలతో చర్యలు

కేటగిరీ వారీగా ఆస్తుల విభజన

ఆక్రమణల తొలగింపు.. కేసుల నమోదు

జిల్లాలో హైపవర్‌ కమిటీ ఏర్పాటు

జిల్లా 409 గ్రామ పంచాయతీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement