
ధాన్యం మొత్తం కొనాల్సిందే
ఉంగుటూరు: ధాన్యం మొత్తం కొనుగోలు చేయండి.. లారీల్లో లోడు చేసిన ధాన్యం మిల్లులకు పంపండి.. ధాన్యం కొనుగోలు లక్ష్యాలు పెంచండి.. గోనె సంచులు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. లారీల్లో లోడు చేసిన ధాన్యం మూడు రోజులుగా మిల్లులకు తరలించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ లారీల వద్ద బైఠాయించారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ టార్గెట్‌ల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం అన్యాయమన్నారు. ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2.20 లక్షల టన్నుల ఉమాత్రమే కొనుగోలు చేస్తా మని ప్రభుత్వం అనడం దారుణమన్నారు. ప్రతి గింజా కొంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బొమ్మిడిలో నిలిచిపోయిన 10 లారీల ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. మండల నాయకులు దూడే కేశవ, వానపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఊడిమూడి దానియేలు, మరుకుర్తి ధనంజయరావు, లంక వెంకటేశ్వరరావు, నక్కా సత్యనారాయణ, సాధనాలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మల్కాపురంలో గళమెత్తి..
దెందులూరు: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగా రు. ముందుగా బరకాలు కప్పి ఉన్న ధాన్యాన్ని పరిశీలించి, బరకాలపై పడిన వర్షం నీళ్లను తోడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో 1,500 టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉండిపోయిందన్నారు. ధాన్యం కొనలేం.. అంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ని బంధనలు సడలించాలని కోరారు. మల్కాపురం పరిధిలో 700 టన్నుల కొనుగోలుకు టార్గెట్ ఇచ్చినట్టు రైతు సేవా కేంద్రం అసిస్టెంట్ చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులు ఆదాడ శ్రీనివాసరావు, లంకా వెంకటరమణ, గొర్రెల రొయ్యా రావు, గుర్రాల శోభన్‌బాబు, కండిబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలకు దిగిన అన్నదాతలు

ధాన్యం మొత్తం కొనాల్సిందే