
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
పెనుగొండ: అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వేసవి కాలం కావడంతో రైతులు కళ్లాల్లోని ధాన్యానికి పూర్తి స్థాయి రక్షణ ఏర్పాటు చేయలేదు. అరగంట పాటు భారీ వర్షం కురవడంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టినా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. ప్లాస్టిక్ బరకాలు కప్పినా కొంతమేర ధాన్యం వర్షార్ఫణం అయింది. ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ మండలంలో 11,782 ఎకరాల్లోనూ, పెనుమంట్ర మండలంలో 12,103, ఆచంట మండలంలో 10,600, పోడూరు మండలంలో 12,800 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనిలో ఎంటీయూ 1121 వరి రకం అధికంగా సాగు చేయగా, పీఆర్ 126, ఎంటీయూ 1153 రకాలు కూడా సాగు చేశారు. వీటిలో పెనుగొండ మండలంలో ఎంటీయూ 1121, ఎంటీయూ 1153 రకాలు ముందుగా కోతకు వచ్చాయి. 50 శాతంకు పైగా కోతలు పూర్తిచేసిఽ ధాన్యాన్ని తేమ శాతం తగ్గించుకోవడానికి ఆరబెట్టుకొనే స్థాయిలో మాసూళ్లు ఉన్నాయి. మంగళవారం కురిసిన వర్షంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ఇదిలా ఉండగా, కోతకు కోయకుండా ఉన్న వరిచేలు భారీ ఈదురు గాలులకు నేలనంటాయి. వరి కోత యంత్రాలతో కోత కోసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన కోత ఖర్చులు పెరిగిపోతున్నాయన్నారు. యంత్రాలు కోయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమయం పెరగడం వలన యంత్రాలకు అధికంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. పంట చేతికందే సమయంలో కురిసిన వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకాల వర్షం.. రైతన్నకు నష్టం

అకాల వర్షం.. రైతన్నకు నష్టం