28 రోజులు.. రూ.3.15 కోట్లు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని సో మవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. స్వామివారికి భారీగా ఆదా యం సమకూరింది. గత 28 రోజులకు గాను నగదు రూపేణా రూ.3,15,85,574ల ఆదా యం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 234 గ్రాముల బంగారం, 7.650 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500ల నోట్ల ద్వారా రూ.41,500లు లభించిందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఓపెన్’ పరీక్షలకు 248 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో దూర విద్యావిధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించిన సోమవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు 248 మంది హాజరయ్యారు. జీవశాస్త్రం పరీక్షకు 108 మందికి 100 మంది, వాణిజ్య/వ్యాపార శాస్త్రం పరీక్షకు 159 మందికి 148 మంది హాజరయ్యారు. జిల్లా పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డీఈసీ కమిటీ కలిపి మొత్తం 7 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు.
అవ్వాతాతల అవస్థలు
గణపవరం: ప్రతినెలా ఇంటి వద్దకే వచ్చే పింఛన్ సొమ్ములు ఈనెలా బ్యాంకు ఖాతాలో జమకావడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జూన్ నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద రద్దీతో క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సోమవారం గణపవరం, అర్ధవరం, పిప్పర తదితర గ్రామాల్లో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు పడిన దృశ్యాలు కనిపించాయి.
బస్ పాస్‌ల జారీకి విరామం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ఏలూరు డిపో పరిధిలో సీజన్ పాసులు, విద్యార్థులకు అందించే పాసుల జారీకి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్న కారణంగా రెండు రోజులపాటు విరామం ఉంటుందని డిపో మేనేజర్ బి.వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 6,7 తేదీల్లో సీజన్ పాసులు, విద్యార్థుల పాసులు జారీ చేయమన్నారు. ఈ సౌకర్యాన్ని 8వ తేదీ నుంచి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
5న పర్యావరణ పరిరక్షణపై పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న పర్యావరణ సంరక్షణ అనే అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని డీఈఓ ఎస్.అబ్రహం ఆదేశించారు. మండల స్థాయిలో 6 నుంచి 12వ తర గతి వరకూ విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆప్‌కాస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.రామారావు సెల్ 9248669171, ఆప్‌కాస్ట్ జిల్లా అకడమిక్ కో–ఆర్డినేటర్ ఎంవీ భాస్కరరావు సెల్ 9989 921797 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
రెండు రైళ్ల రద్దు
ఏలూరు (టూటౌన్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు, విజయవాడ డివిజన్‌ల పరిధిలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రద్దీ నియంత్రణలో భాగంగా ఈ చర్యలను తీసుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి–విజయవాడ 07767 నంబర్, విజయవాడ–రాజమండ్రి 07459 నంబర్ రైళ్లను ఈ నెలాఖరు వరకు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ ఎం.మంద్రుపకర్ పేర్కొన్నారు.


