
గురజాడ వేషధారణలో విద్యార్థులు
ఏలూరు (టూటౌన్): గురజాడ అప్పారావు 161వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థుల సామూహిక గీతాలాపన ఆకట్టుకుంది. స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద గురువారం డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శన స్టేడియం నుంచి మెయిన్ రోడ్డు, ఫైర్ స్టేషన్ సెంటర్, డీఈఓ ఆఫీసు, రిజిస్టార్ ఆఫీసు, జిల్లా గ్రంథాలయ సంస్థ మీదుగా తిరిగి ఇండోర్ స్టేడియం చేరుకుంది. ర్యాలీలో భాగంగా స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం నిర్వహించి దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని ఆలపించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా గురజాడ చిత్రానికి పూలమాలలు వేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎం.సుజయ్ అధ్యక్షతన చైతన్య సదస్సు నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ గురజాడ అప్పారావు జీవితాన్ని ఆయన గేయాల్ని ఎళ్లవేళలా గుర్తించుకోవాలన్నారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, మానవతా, మాతృదేవోభవ సేవా ట్రస్ట్, డీఆర్‌డీఎ, సెట్‌వెల్, జిల్లా స్పోర్ట్ అథారిటీలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు. వివిధ స్కూళ్ల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యరావు, మానవతా జిల్లా సమన్వయ కర్త ఆలపాటి నాగేశ్వరరావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు, ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కెసీహెచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తానా సాహితీ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా రమావతి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, నారీ సాహిత్య భేరి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న అంతర్జాల అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ అంతర్జాల సాహితీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం నుంచి శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సాహిత్య సమావేశంలో 15 దేశాల నుంచి తెలుగు కవయిత్రులు పాల్గొననున్నారు.