ఏలూరు టౌన్: భీమడోలు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో అంగలూరి చిన్నారి(4)కి పారిశుధ్య కార్మికులు వైద్యం చేశారంటూ సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏలూరు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డాక్టర్ ఏవీఆర్ మోహన్ అన్నారు. భీమడోలు మండలం అర్జావారీగూడెంకు చెందిన చిన్నారి జ్వరంతో బాధపడుతుండగా మూడు రోజులు గ్రామంలోని ఆర్‌ఎంపీకి చూపించారు. జ్వర తీవ్రత పెరగడంతో భీమడోలు సీహెచ్‌సీకి ఈనెల 19న మధ్యాహ్నం 12.30గంటలకు తీసుకువచ్చారని తెలిపారు. చిన్న పిల్లల వైద్యుడు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేయించగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అదేరోజు సాయంత్రం వరకూ చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉండగా రాత్రి 7.30 గంటలకు కడుపునొప్పి వస్తుందని చెబుతూ చిన్నారి స్పృహ కోల్పోయింది. వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్ అశ్విని చికిత్స ప్రారంభించి, చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ అల్బర్ట్‌కు సమాచారం అందించారు. చిన్నారిని రక్షించేందుకు ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది ప్రయత్నం చేశారు. బాలిక ఆరోగ్యస్థితి క్షీణించటంతో భీమడోలు సీహెచ్‌సీలోనే రాత్రి 8.20 గంటలకు మరణించిందని తెలిపారు. హాస్పిటల్‌లో పారిశుధ్య కార్మికులు వైద్యం చేసే అవకాశం లేదని మోహన్ స్పష్టం చేశారు. భీమడోలు సీహెచ్‌సీలో మంచి వైద్యం అందుబాటులోకి ఉందని.. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బాలిక మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిమిత్తం తరలించారని తెలిపారు. ఏలూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం హిస్టోపాథాలజీ, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్స్‌కు రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారని చెప్పారు. అసత్య ప్రచారాలతో డాక్టర్లు, వైద్య సిబ్బంది మానసిక, నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఇలాంటి అసత్య, ప్రచారాలను తిప్పికొట్టాలని డాక్టర్ మోహన్ విజ్ఞప్తి చేశారు.
ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు చికిత్స చేశారు
డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్