
ఏలూరు టౌన్: పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్సు బకాయిలు మంజూరు చేయటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు జీతాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకున్నా.. అలవెన్సుల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడంతో పోలీసులకు ఆర్థిక భరోసా లభించింది. బకాయిల చెల్లింపులతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలన గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.
పోలీసులకు ఊరట
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి పశ్చిమలో సుమారు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్థాయి నుంచి ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెచ్‌సీ, కానిస్టేబుల్ వరకూ అలవెన్సుల బకాయిలు మంజూరవుతున్నాయి. సుమారు 11 నెలలుగా పేరుకుపోయిన ట్రావెలింగ్ అలవెన్సు బకాయిలు ఒకేసారి విడుదల చేయటంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ, ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్ రుణాలు సైతం మంజూరు చేయటంతో పోలీసులు సంతోషంగా ఉన్నారు. ఇక సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ బకాయిలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, అవికూడ త్వరలోనే మంజూరు చేస్తారని అంటున్నారు.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. రెండు జిల్లాల్లోనూ సుమారు ఆయా బకాయిల చెల్లింపులు రూ.8 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్క టీఏ అలవెన్సు బకాయిలు మాత్రమే సుమారుగా రూ. 3.82 కోట్ల నుంచి రూ. 4.12 కోట్ల వరకూ ఉందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు హెచ్‌ఆర్‌ఏ, ఇతర బకాయిలు చూస్తే రెండు జిల్లాలోనూ పోలీసుల శాఖకు రూ.8 కోట్ల వరకూ బకాయిలు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్ రుణాలు సైతం విడు దల కావటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖలో సీఐలు– 30 , సబ్ ఇన్స్‌పెక్టర్లు –120, ఏఎస్‌ఐ –150, హెడ్ కానిస్టేబుల్స్ – 450 , కానిస్టేబుల్స్ – 1850 మంది ఉన్నారు. మొత్తంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2600 మంది వరకూ పోలీస్ సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట
పోలీస్ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సిబ్బంది అనారోగ్యంతో మరణిస్తే సంక్షేమ నిధి నుంచి ఆర్థికంగా ఆదుకుంటున్నాం. తాజాగా ప్రభుత్వం అలవెన్సు బకాయిలు విడుదల చేసింది. టీఏ అలవెన్సులు, హెల్త్, హెచ్‌ఆర్‌ఏ ఇలా అన్నీ మంజూరు చేశారు.
– రాహుల్‌దేవ్ శర్మ, ఏలూరు ఎస్పీ
బకాయిల చెల్లింపుపై హర్షం
ఉమ్మడి పశ్చిమలో 2,550 మంది పోలీసులకు లబ్ధి
సుమారుగా రూ.8 కోట్లు విడుదల
బకాయిల చెల్లింపులు హర్షణీయం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీస్ సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించడం హర్షణీయం. సిబ్బందికి ఏ సమస్య వచ్చినా పోలీస్ అధికారుల సంఘం వారికి అండగా ఉంటుంది. పోలీస్ సిబ్బందికి 11 నెలల టీఏ అలవెన్సులతోపాటు, ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్, హెల్త్ అలవెన్సులు సైతం విడుదల చేశారు. అలాగే బకాయిలు లేకుండా సిబ్బందికి అలవెన్సులు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం.
– ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏలూరు
సరెండర్ లీవ్స్ చెల్లింపునకు చర్యలు
పోలీస్ సిబ్బంది, అధికారులకు సంబంధించి పేరుకుపోయిన అలవెన్సు బకాయిలు ప్రభుత్వం చెల్లించటం హర్షణీయం. సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ విడుదల చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పోలీసులకు ఒకేసారి ఆర్థికంగా ఊతం ఇచ్చినట్లయ్యింది. పోలీస్ అధికారుల సంఘం నిత్యం సిబ్బంది, అధికారుల సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తూ పరిష్కారానికి కృషి చేస్తోంది.
– బండారు నాని, పోలీస్ అధికారుల సంఘం జిల్లా ట్రెజరరీ, ఏలూరు


