
తణుకులో పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి కారుమూరి దంపతులు
తణుకు అర్బన్ : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆకాంక్షించారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఉగాది సందర్భంగా ఆలయంలో వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామికి మంత్రి కారుమూరి, లక్ష్మీకిరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బ్రహ్మశ్రీ ప్రదీప్ సిద్ధాంతి నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి దంపతులకు ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, ఆలయ చైర్మన్ కొత్తపల్లి రామచంద్రరావు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.అన్నపూర్ణాదేవి, తాటిపర్తి వాసు, కొమ్మోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.