
సీఎం సభకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
దెందులూరు: దెందులూరులో ఈ నెల 25న వైఎస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెందులూరు రానున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్,, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబుతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించి సభా స్థలి వరకు రెండు రోడ్డు మార్గాలను బారికేడ్లతో ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలానికి వెళ్ళే ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గంలోను, సభాస్థలి వద్ద ఎలాంటి ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు లేకుండా పకడ్బందీగా పారిశుధ్యాన్ని నిర్వహించాలని డీపీఓకు సూచనలు చేశారు. సభా స్థలివద్ద డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఐదు స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఏ పీడీ విజయరాజును ఆదేశించారు. కలెక్టర్ వెంట డీపీఓ మల్లికార్జునరావు, ఆర్ అండ్ బీ అధికారులు, ఏలూరు ఆర్‌డీఓ పెంచల కిషోర్, దెందులూరు తహసీల్దార్ ఎన్‌వీ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
