
అర్చక స్వాములకు ఉగాది పురస్కార సత్కారం చేస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్‌ః దేవదాయ శాఖలో విధులు నిర్వహించడం, సేవలందించడం పూర్వజన్మ సుకృతమని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. శోభకృత్ ఉగాది పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె.విజయరాజు అధ్యక్షతన స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ దేవుడికి చేరువగా సేవలందించే అవకాశం రావడం దేవదాయ శాఖ మంత్రిగా తనకు, శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అదృష్టమన్నారు. అర్చకస్వాములు, ఉద్యోగులు నీతినిజాయితీలో విధులు నిర్వహించాలన్నారు. హైందవ ధర్మాన్ని నలుమూలలకు ఇనుమడింప చేసేలా చిత్తశుద్ధితో సేవలందించాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి దేవాలయాల పరిరక్షణ, నూతన ఆలయాల నిర్మాణాలకు వందల కోట్ల నిధులు సమకూరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో గతంలో 1625 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేవారన్నారు. జగన్ ప్రభుత్వంలో 5 వేల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు నెలకు రూ.5వేలు చొప్పున అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3 వేల నూతన ఆలయాల నిర్మాణానికి మొదటి విడతగా రూ.300 కోట్లు విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సుపరిపాలనను తప్పుదారి పట్టించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని వాటిని భగవంతుడి సహకారంతో జగన్ తిప్పి కొడుతున్నారన్నారు. కొందరు అవినీతి పరులు వందల కోట్ల విలువైన దేవుని భూములను అన్యాక్రాంతం చేసి అనుభవిస్తున్నారన్నారు. వాటిని దేవునికే స్వాధీన పర్చేలా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్లు, స్తపతులు, దేవలయ కార్యాలయాల అధికారులు, ఏడు జిల్లాల అర్చకులు పాల్గొన్నారు. సభానంతరం అర్చక స్వాములకు శోభకృత్ ఉగాది పురస్కారాలను అందచేశారు. తొలుత మంత్రి కొట్టును గజమాల, మెమెంటోలతో సత్కరించారు.
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

మంత్రి కొట్టు సత్యనారాయణను సత్కరిస్తున్న దేవదాయ శాఖ సిబ్బంది