వశిష్ట వారధికి త్వరలో శ్రీకారం

- - Sakshi

నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో గతేడాది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. అయితే ప్రతిపక్షాలు కోర్టు చిక్కులు కలిగించడంతో కీలకమైన వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణాన్ని ఆ సమయంలో సీఎం ప్రారంభించలేకపోయారు. అదే బహిరంగ వేదికపై 2, 3 నెలల్లో వశిష్ట వంతెనకు టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చెప్పిన 4 నెలల్లోనే వశిష్ట వంతెన అంశాన్ని టెండర్ల దశకు తీసుకొచ్చారు. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్‌ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపడతారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర రోడ్డు, 380 మీటర్ల మేర వంతెన నిర్మాణానికి రూ 580.42 కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 16న మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ నేషనల్‌ హైవే అథారిటీ ఉత్తర్వులిచ్చింది. వెంటనే టెండర్లు పిలవాలని సంస్థ డైరెక్టర్‌ అండ్‌ జనరల్‌ రవిచంచల్‌ ఆదేశాలిచ్చారు. మరో 2,3 రోజుల్లో టెండర్లు పిలిచేందుకు ముహూర్తం సిద్ధమైంది.

24 నెలల్లోనే పనులు పూర్తయ్యేలా..

రెండేళ్ల కాల వ్యవధిలో పనులు పూర్తిచేసేలా టెండర్లు పిలుస్తున్నారు. అలాగే బైపాస్‌రోడ్డు, గోదావరిపై వంతెన నిర్మాణానికి సంబంధించి మంజూరు చేసిన నిధులు ఏ సంవత్సరంలో ఎంతమేర మంజూరు చేస్తారనే అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం క్ష్ణ్నుంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. 2023–24 ఆర్థిక సంవవత్పరంలో 20 శాతం నిధులు, 2024–25లో 65 శాతం, 2028–26 సంవత్సరంలో మిగిలిన 15 శాతం నిధులు కేంద్రం మంజూరు చేయనుంది. ఈపీసీ మోడ్‌ పద్ధతిలో పనులు కొనసాగిస్తారు. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ ప్రస్తుతం అటు కోనసీమ, ఇటు పశ్చిమగోదావరి జిల్లాల మధ్య వశిష్ట గోదావరిపై నరసాపురంలో వంతెన నిర్మించాలనేది దశాబ్ధాల డిమాండ్‌. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలోనే అంకురార్పణ జరిగిన ఈ వంతెన నిర్మాణం దశాబ్దాలుగా కలగా మిగిలిపోయింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం కూడా ఆగిపోయింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టి పనిచేయడంతో గోదావరి జిల్లాల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు స్థలసేకరణ కోసం మంజూరు చేసింది. స్థలసేకరణ కూడా పూర్తయ్యింది. ప్రతిపక్షాలకు చెందిన కొందరు అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అయితే చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్‌ చేయించారు. తాజాగా హైకోర్టులో ప్రతిపక్షాల ప్రోద్బలంతో వేసిన కేసును కోర్టు కొట్టేసింది.

సీఎం, చీఫ్‌ విప్‌ చొరవతో..

చించినాడ 216 జాతీయ రహదారికి కోనసీమ జిల్లా నుంచి నరసాపురం వరకూ బైపాస్‌ నిర్మించి, మధ్యలో గోదావరిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మోక్షం కలుగుతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాయడం, శివకోడు సఖినేటిపల్లి మీదుగా రామేశ్వరం నుంచి నరసాపురం వరకూ 22 కిలోమీటర్లు మేర స్టేట్‌ హైవేను 216 కు బైపాస్‌గా మార్చాలని.. మధ్యలో రాజుల్లంక వద్ద గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ లేఖకు స్పందించిన గడ్కరీ వెంటనే ఆమోదం చెప్పడంతో వంతెన సమస్యకు లైన్‌ క్లియరైంది.

వైఎస్సార్‌ హయాంలోనే..

ఎన్టీఆర్‌ తరువాత నరసాపురం వశిష్ట వంతెనకు బీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. 2008 ఏప్రిల్‌ 16న వశిష్ట వంతెనకు శంకుస్థాపన చేశారు. వెంటనే టెండర్లు పిలిచి రూ.194 కోట్లతో పనులు సత్యం కంపెనీకి చెందిన నిర్మాణ సంస్థ మైటాస్‌కు అప్పగించారు. సర్వే పూర్తయ్యి, పనులు ప్రారంభం అయ్యే సమయానికి సత్యం సంస్థ సంక్షోభంలో పడి పనులు నిలిచిపోయాయి. వైఎస్‌ మళ్లీ పనులు వేరే కంపెనీకి అప్పగించారు. మళ్లీ ఈ అంశం కోర్టుకెక్కింది. 2014 నుంచి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కోర్టులో స్టే వెకేట్‌ చేయించే ప్రయత్నం కూడా చేయకుండా, వంతెన కట్టేస్తున్నామంటూ ప్రతిరోజూ డ్రామాలు నడుపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.

నరసాపురం వద్ద పంటుపై రేవు దాటుతున్న ప్రయాణికులు

మరో రెండు రోజుల్లో టెండర్లు పిలిచేందుకు ముహూర్తం

కాల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రణాళిక

సీఎం కృషి, ముదునూరి చొరవతో కల సాకారం

వశిష్ట వంతెన కట్టి తీరుతాం

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో స్థల సేకరణ పూర్తి చేశాం. మరో 2, 3 రోజుల్లో టెండర్లు పిలుస్తాము. రెండేళ్ల కాల వ్యవధిలో పనులు పూర్త య్యేలా టెండర్లు ఖరారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వశిష్ట వంతెన కట్టి తీరుతాం. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వంతెనకు శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో వంతెన ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం వంతెన విషయంలో అనేక డ్రామాలు నడిపింది. జగన్‌మోహన్‌రెడ్డి వంతెన నిర్మాణానికి పూనుకుంటున్నారు.

– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top