
ఇంట్లో కాలిపోయిన సామగ్రి
ఉంగుటూరు: ఉంగుటూరులో ఓ డాబా ఇంట్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లో ఉన్న సామగ్రి కాలిబూడిదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని రెడ్డి సత్యనారాయణకు చెందిన ఇంటికి తాళం వేసి నెల రోజులుగా గుడివాడలో ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న ఏసీ, బీరువా, మంచం, టీవీ, ఫర్నిచర్, సామగ్రి, 100 డాలర్ల విదేశీ కరెన్సీ కాలిపోయాయి. స్థానికులు స్పందించి సమాచారం అందించడంతో తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి రామారావు, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వంట ఇంట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ మధ్య గదిలో పేలిపోయి ఉండటంతో ఇంట్లో దొంగతనానికి వచ్చి గ్యాస్ లీక్ చేసి అంటించి ఉంటారనే అనుమానిస్తున్నారు. ప్రమాదంలో రూ.2.50 లక్షల ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
పాము కాటుకు బాలుడి మృతి
ఏలూరు టౌన్: గ్రామంలో కిరాణా కొట్టుకు వెళ్లిన ఓ బాలుడు పాముకాటుకు గురై మృతి చెందాడు. కాట్లంపూడికి చెందిన గుత్తుల హేమచందర్ (9) బుధవారం ఇంటి సమీపంలో కిరాణా కొట్టుకు వెళ్లగా, అక్కడ ఏదో తనని కుట్టిందని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. బాలుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పాము కాటుకు గురైనట్లు నిర్ధారించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.