
తణుకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల స్వాఽధీనం చేసుకున్న మందులు
తణుకు: పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అబార్షన్ కిట్లు, వయాగ్రా, మత్తు మందుల దిగుమతి వ్యవహారం తణుకులో బట్టబయలైన విషయం తెలిసిందే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ మందులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.30 లక్షల విలువైన నిషేధిత మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి సుమారు రూ.2 కోట్ల విలువైన నిషేధిత మందులు రాష్ట్రానికి సరఫరా అయినట్లుగా గుర్తించిన అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఇటీవల హుబ్లీ, కర్ణాటక ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక బృందాలు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్థారించాయి. అయితే వీటి మూలాలు ముంబైలో ఉన్నట్లు తేలడంలో తాజాగా ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్లాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో మందులు ఎక్కడకు చేరుతున్నాయి? ఎవరు వినియోగిస్తున్నారు? అనే కోణంలో అధికారులు కూపీ లాగుతున్నారు.
కదిలిన మందుల డొంక
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో అక్రమ మందుల దందా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో తణుకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అబిద్ అలీ నేతృత్వంలో చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. కేవలం నిద్రమాత్రలే కాకుండా అబార్షన్ కిట్లు, వయాగ్రా వంటి నిషేధిత మందులు సైతం మార్కెట్‌లో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ దిశగా సోదాలు చేపట్టారు. తణుకు, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి ఎలా దిగుమతి చేసుకుంటున్నారనే కోణంలో ఆరా తీసిన అధికారులకు బెంగళూరు, గుజరాత్ కేంద్రాలుగా నిషేధిత మందులను రాష్ట్రానికి దిగుమతి చేసుకుంటున్నారని గుర్తించారు. మందుల తయారీ కంపెనీలు తప్పుడు ఏజెన్సీల ద్వారా పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. వైద్యులు సూచనల మేరకు విక్రయించాల్సిన మందులను విచ్చలవిడిగా మార్కెట్‌లో అమ్మకాలకు ఉంచారు. ఈ మందులను ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని కొందరు వ్యక్తులకు విక్రయిస్తుండగా, వీటికి బిల్లులు లేకపోగా జీఎస్టీ సైతం చెల్లించరు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన రూ.కోట్లు ఆదాయానికి గండి పడటంతోపాటు ప్రజల ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి.
మాఫియా గుట్టురట్టు
బెంగళూరుకు చెందిన ఐశ్వర్య ఫార్మా సంస్థ ఏలూరుకు చెందిన పి.నగేష్‌కు ఏడాది కాలంలో 30 వేల అబార్షన్ కిట్లు సరఫరా చేసింది. వీటి విలువ రూ.1.35 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని తుముకూరుకు చెందిన ఆద్యా హైజిన్ సొల్యూషన్స్ బీదర్‌కు చెందిన సంగమేష్‌కు రూ.లక్షల విలువైన వయాగ్రా మందులు సరఫరా చేసింది. అతని నుంచి నగేష్‌కు చేరాయి. చిలకలూరిపేటకు చెందిన కె.నరేంద్రబాబుకు అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర మెడికల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి 5.50 లక్షల స్ట్రిప్‌లు చేరాయి. వీరిద్దరూ కలిసి రెండేళ్ల కాలంలో రూ.12 కోట్లు విలువైన మందులను అనధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసినట్లు తేలింది. ఇదిలా ఉంటే ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని ఔషధ నియంత్రణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అక్రమ మందుల దందాపై స్పందించినట్లు సమాచారం. దీంతో ముంబై, గుజరాత్ ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల్లో సోదాలు చేసేందుకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరు, తుముకూరు, హుబ్లీ, బీదర్ ప్రాంతాల్లో నాలుగు ఫార్మా ఏజెన్సీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు అక్రమంగా సరఫరా
తప్పుడు ఏజెన్సీల ద్వారా యథేచ్ఛగా విక్రయాలు
తణుకులో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు
ముంబై, గుజరాత్ ఫార్మా కంపెనీల్లోనూ ఔషధ నియంత్రణ శాఖ అధికారుల
బృందాల తనిఖీలు
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
నిషేధిత మందులు రాష్ట్రానికి సరఫరా, విక్రయాలపై దృష్టి సారించాం. ఇప్పటికే పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి నిషేధిత మందులు, అక్రమాలు గుర్తించాం. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. మరోసారి అధికారుల బృందం తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– ఎంపీఆర్ ప్రసాద్, డెప్యూటీ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ