పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లిద్దరూ జైలుకు వెళ్లాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కారుమూరి మాట్లాడారు. ఈ స్కాం 2017లోనే వెలుగు చూసినా.. చంద్రబాబు హయాంలో తొక్కిపెట్టారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో యువతకు అందాల్సిన వనరులకు సంబంధించి రూ.371 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ బిల్లుతో మనీ ల్యాండరింగ్ చేసి ప్రజాధనాన్ని దోపిడీ చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఆధారాలతో అసెంబ్లీ వేదికగా స్కాంను బట్టబయలు చేశారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు అరెస్టయ్యారని, చంద్రబాబు అండ్ కో కూడా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.
స్పీకర్, దళిత ఎమ్మెల్యేపై దాడి అమానుషం
శాసనసభ నిబంధనలను కాలరాస్తూ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగి పేపర్లు చింపి మీదకు విసరడమే కాకుండా దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై దాడికి దిగి గాయపరచడం టీడీపీ రౌడీయిజానికి నిదర్శనమన్నారు. గతంలో ఇదే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించిన తమ నేతలను నరికేస్తాం, చంపేస్తాం అని తొడలు చరిచిన విషయం అందరికీ తెలిసిందేనని, మంత్రి రోజాను ఏడాదిపాటు అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ చేయలేదా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.