
నాగిరెడ్డిగూడెంలో దాడుల్లో పాల్గొన్న ట్రైనీ కలెక్టర్ అపూర్వ భరత్
ఏలూరు టౌన్: శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని ప్రజలకు, అధికారులకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు జరగాలని ఎమ్మెల్యే నాని ఆకాక్షించారు.
సారా తయారీకి దూరంగా ఉండండి
చింతలపూడి: సారా తయారీకి దూరంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ట్రైనీ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. అదనపు ఎస్పీ ఎన్.సూర్య చందర్రావుతో కలిసి మంగళవారం ఆయన స్థానిక ఎస్‌ఈబీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం నాగిరెడ్డిగూడెంలో పర్యటించారు. గ్రామంలో ఎస్‌ఈబీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో స్వయంగా పాల్గొన్నారు. గతంలో సారాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉండి సారా తయారీని వీడి ప్రభుత్వ ప్రోత్సాహంతో వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వారితో మాట్లాడారు. గ్రామంలో జరిపిన దాడుల్లో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
23న వాటికన్ రాయబారి ఏలూరు జిల్లా పర్యటన
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట), పెదవేగి: ఈ నెల 23న వాటికన్ రాయబారి లియోఫోర్డ్ జిరెల్లి ఏలూరు జిల్లాలో పర్యటించనున్నట్లు ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు తెలిపారు. మంగళవారం బిషప్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ రాత్రికి జిరెల్లి ఏలూరు చేరుకుంటారని, 23వ తేదీ ఉదయం 7 గంటలకు స్థానిక ఆర్‌సీఎం కెథడ్రల్ దేవాలయంలో దివ్యబలిపూజలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం నగర ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని, సాయంత్రం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత సన్నిధిలో దివ్యబలిపూజలో పాల్గొంటారని వివరించారు. నిర్మలగిరి మేరీమాత దేవాలయంలో ఏటా మార్చి 23 నుంచి 25 వరకూ మేరీమాత ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవిస్తారన్నారు. సమావేశంలో వికార్ జనరల్ ఫాదర్ పీ.బాల, సెయింట్ జోసఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జీ.మోజెస్ తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఎన్నికలు వాయిదా
ఏలూరు (టూటౌన్): ఈ నెల 24న జరగాల్సిన ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25లోగా అర్హులైన న్యాయవాదుల ఓటర్ల లిస్టును బార్ అసోసియేషన్ నోటీస్ బోర్డులో డిస్‌ప్లే చేయాలని, అనంతరం ఈ నెల 31న ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇంటర్ పరీక్షలకు 34,212 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన గణితం పేపర్–2ఏ, బోటనీ –2, సివిక్స్ –2 పరీక్షలకు 35,318 మంది విద్యార్థులకు గాను 34,212 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 11,375 మంది జనరల్ విద్యార్థులకు 11014 మంది హాజరు కాగా 361 మంది గైర్హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 15761 మంది జనరల్ విద్యార్థులకు 15,376 మంది హాజరయ్యారు. 1,568 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,458 మంది హాజరయ్యారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బిషప్ పొలిమేర జయరావు

ఆళ్ళ నాని