ఆధిపత్యమే పరమార్థమా?!

Sakshi Editorial Tussle between Kerala Governor and Chief Minister

ఎప్పుడూ వార్తల్లో ఉండే పశ్చిమ బెంగాల్‌ ప్రశాంతంగా ఉంది. ఢిల్లీలో కూడా మొన్న గాంధీ జయంతి రోజున తలెత్తిన సమస్య మినహా పెద్దగా వివాదం ఛాయలు లేవు. తెలంగాణ సరేసరి. ఇంతలోనే కేరళలో రాజుకుంది. అక్కడ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య ఘర్షణ బయల్దేరింది. గత నెలలో కన్నూరు యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకంపైనా, అంతక్రితం అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన లోకాయుక్త అధికారాల కుదింపు వ్యవహారంపైనా ఆరిఫ్‌ కన్నెర్రజేశారు. తాజాగా కేరళ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎంపిక అంశంలో గొడవ మొదలైంది. ఈ వ్యవహారంలో తమ బాధ్యతను మరిచారంటూ 15 మంది సెనేట్‌ సభ్యుల్ని గవర్నర్‌గా తనకున్న అధికారాలనుపయోగించి తొలగించారు. అంతేకాదు... మంత్రుల్ని పదవీచ్యుతుల్ని చేసే అధికారం కూడా తనకున్నదంటూ హెచ్చరించారు. వైస్‌ చాన్సలర్ల నియామ కాల్లో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయిగా ఉండేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు గత నెల అసెంబ్లీలో ఆమోదం పొందింది. దానిపై ఇంతవరకూ గవర్నర్‌ సంతకం చేయలేదు. 

నిర్ణయాలు తీసుకోవటంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మాట నెగ్గాలా, నియామకం ద్వారా పదవిలోకొచ్చిన గవర్నర్‌ది ఆఖరిమాట కావాలా అన్నదే ఈ వివాదాలన్నిటి సారాంశం. కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పాలకపక్షం ఉన్నప్పుడు పెద్దగా గొడవులుండవు. అలాగని విపక్ష ఏలు బడి ఉన్నచోట్ల నిత్యం సమస్యలుంటాయన్నది కూడా నిజం కాదు. రాష్ట్రపతిగా ఇటీవల పదవీ విరమణ చేసిన రాంనాథ్‌ కోవింద్‌ బిహార్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు అప్పటికి బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న నితీష్‌ కుమార్‌తో ఆయనకెన్నడూ తగవు రాలేదు. రాజకీయపరంగా చూస్తే అంతవరకూ కోవింద్‌ బీజేపీలో చురుకైన నాయకుడు. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆరిఫ్‌ కూడా సీనియర్‌ నేత. చిరకాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వమ్ము చేస్తూ రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన బిల్లు ముస్లిం మహిళల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ ఆయన 1986లో కాంగ్రెస్‌కు రాజీ నామా చేశారు. బోఫోర్స్‌ శతఘ్నల కొనుగోళ్లలో కుంభకోణం చోటుచేసుకున్నదంటూ వీపీ సింగ్‌తో కలిసి రాజీవ్‌ సర్కారుపై పోరాడారు. అనంతరకాలంలో వీపీ సింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ ప్రభు త్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యం చూస్తే ఆరిఫ్‌ వివాదాల్లో చిక్కుకోవటం కొంత వింతగానే ఉంటుంది. గవర్నర్‌గా ఉన్నవారూ, రాష్ట్రాన్ని పాలించేవారూ అరమరికల్లేకుండా చర్చించుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. కానీ సమస్యలపై రచ్చకెక్కడం, మీడియా సమావేశాల్లో విమర్శించుకోవటం అలవాటైంది. ట్విటర్‌ వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకునే ధోరణి కూడా బయల్దేరింది. మంత్రుల్ని తొలగించే అధికారం కూడా తనకున్నదంటూ ట్విటర్‌ ద్వారానే ఆరిఫ్‌ హెచ్చరించారు. ‘సీఎంకూ, ఆయన మంత్రులకూ గవర్నర్‌కు సలహాలిచ్చే అధికారం ఉంది. కానీ అందుకు భిన్నంగా గవర్నర్‌ను కించపరుస్తూ కొందరు మంత్రులు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని తొలగించటంతో సహా చర్యలు తీసుకునే అధికారం నాకుంది’ అన్నది ఆ ట్వీట్‌ సారాంశం. కేరళ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎంపిక ప్రక్రియలో వివాదం రాజేయటం ఆరెస్సెస్‌ ఎజెండా అమలు కోసమేనని కేరళ విద్యామంత్రి ఆర్‌.బిందు అనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. 

మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయనీ, వాటి ర్యాంకులు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా అడుగంటుతున్నాయనీ ఏటా తెలుస్తూనే ఉంది. వాటిని మళ్లీ చక్కదిద్దటానికి పాలనాపరంగా ఏం చేయాలన్న విషయంలో ఎవరూ పెద్దగా ఆలోచిస్తున్న దాఖలా లేదు. తగినంతమంది అధ్యాపకులు లేకపోవటం, వారిలో చాలామంది కాంట్రాక్టు ప్రాతి పదికనే వచ్చినవారు కావటం, ప్రభుత్వాలు సకాలంలో నిధులు అందించకపోవటం ప్రమాణాలు పడిపోవటానికి ప్రధాన కారణాలని విద్యార్థి సంఘాల నాయకులూ, అధ్యాపకులూ ఆరోపిస్తు న్నారు. ఇలాంటి అంశాల్లో గవర్నర్‌ అభ్యంతరం లేవనెత్తితే అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్య ప్రమాణాలను కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని అందరూ జేజేలు పలుకుతారు. కానీ వైస్‌ చాన్సలర్‌ నియామకం, సెనేట్‌ సభ్యుల ఎంపిక, తొలగింపు తదితర అంశాల్లో పట్టుదలకు పోవటం వల్ల ప్రయోజనమేమిటో అర్థం కాదు. ఈ విషయంలో తనకున్న అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటం, ఫలానావిధంగా చేయటమే ఉత్తమమని సలహా ఇవ్వటం మంచిదే. కానీ అందు కోసం రచ్చకెక్కటం వల్ల ఉన్నత విద్యకు ఒరిగేదేమిటి? గవర్నర్ల వ్యవస్థ విషయంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కీలక సూచనలు చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు చేసే నిర్ణయాలకు ఉన్నంతలో విలువనీయటం సరైందని అభిప్రాయపడింది. సర్కారియా కమిషన్‌ నివేదిక కూడా విస్తృతమైన సిఫార్సులు చేసింది. రాజకీయాలకు సంబంధంలేనివారు, తటస్థులుగా ముద్రపడిన వారు గవర్నర్లయితే మంచిదని తెలిపింది. కానీ ఆ కోవలోకొస్తారని భావించినవారు సైతం వివా దాల్లో ఇరుక్కున్న ఉదంతాలు లేకపోలేదు. నిర్ణయ ప్రక్రియలో పరిధులు అతిక్రమించి విపరీత పోకడలకు పోవటం, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటం వంటివి చోటుచేసుకుంటే గవర్నర్లు ప్రశ్నించటంలో తప్పులేదు. కానీ ఎంతసేపూ ఆధిపత్యం కోరుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. కేరళ గవర్నరైనా, మరొకరైనా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top