ఇది రావణ కాష్ఠం | Sakshi
Sakshi News home page

ఇది రావణ కాష్ఠం

Published Wed, May 11 2022 1:49 AM

Sakshi Editorial On Sri Lanka financial crisis and Mahinda Rajapaksa

లంక తగలబడుతోంది. ఆంజనేయుడి తోకకు అంటించిన నిప్పు ఆనాటి లంకాదహనానికి దారి తీస్తే, ఇప్పుడు కట్టలు తెగిన ప్రజాగ్రహం ఆ పని చేస్తోంది. అప్పుడైనా, ఇప్పుడైనా పాలకుల పాపమే శాపమై ఆ దేశాన్ని దహిస్తోంది. అనేక వారాల ఆందోళనలు హింసారూపం దాల్చడంతో ప్రధానమంత్రి పదవి నుంచి అన్నయ్య మహింద సోమవారం పక్కకు తప్పుకున్నారు.

తమ్ముడు గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పీఠాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. నెలరోజుల్లో రెండోసారి దేశంలో ఎమర్జెన్సీ. అన్నిటికీ కొరత. కర్ఫ్యూ ఉన్నా వీధుల్లో నిరసనకారులు. సోమవారం నాటి ఘర్షణల్లో ఒక పార్లమెంట్‌ సభ్యుడితో సహా కనీసం ఎనిమిది మంది మరణం. 225 మందికి పైగా గాయాలు. మంగళవారం రాజపక్సీయులు హెలికాప్టర్‌లో పారిపోవడం. ఇవన్నీ చూస్తుంటే – శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా రాజకీయ సంక్షోభంలోకి జారిపోయిందని అర్థమవుతోంది. 

హింసాకాండ, రక్తపాతం శ్రీలంకకు కొత్త కావు. కానీ, పౌర సమాజంలో ఇప్పుడు చూస్తున్నంత ఆగ్రహం, హింస మునుపెన్నడూ చూడనివి. గత నెలన్నర పరిణామాలు, సమాజంలోని అనిశ్చితి, ప్రస్తుతం పాలనే లేని పరిస్థితులు చూస్తుంటే– హిందూ మహాసముద్రంలోని ఈ బుద్ధభూమి అంత ర్యుద్ధం దిశగా సాగుతోందా అని ఆందోళన కలుగుతుంది. మహిందా ఇల్లు, వారి పూర్వీకుల గృహం సహా మాజీ మంత్రుల నివాసాలు జనాగ్రహంలో దగ్ధమైన తీరు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

దేశవ్యాప్త కర్ఫ్యూను ఉల్లంఘించి మరీ, లగ్జరీ, స్పోర్ట్స్‌ కార్లతో సహా వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రతిపక్ష నేతలు సైతం వారి ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయారు. విధ్వంసానికి పాల్పడుతున్న ప్రదర్శనకారుల్ని కట్టడి చేయలేక చివరకు మంగళవారం నాడు రక్షణ శాఖ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిందంటే ద్వీపదేశంలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

ఇటు శాంతిభద్రతల సమస్య, అటు ప్రభుత్వమే లేని పాలనతో రాజకీయ సంక్షోభం – వెరసి శ్రీలంకది చిత్రమైన పరిస్థితి. కనీసం మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుతో తాత్కాలికంగా పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నమొక్కటే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్న దారి. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో దీర్ఘకాలిక ఆర్థిక వెసులుబాటు కోసం ఈ ద్వీపదేశం ప్రయత్నిస్తున్న వేళ అది మరీ ముఖ్యం.

రాబోయే కొద్ది రోజుల్లో శ్రీలంక పార్లమెంట్‌ సభ్యులు సమావేశ మవుతారా, దేశానికి గండం గట్టెక్కడానికి అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, సైన్యాన్నీ – పోలీసులనూ నమ్ముకున్న అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆ ప్రక్రియకు సహకరిస్తారా అన్నది వేచిచూడాలి. దేశ ప్రధాని నివాసం దగ్గరý‡ అత్యున్నత స్థాయికి చెందిన సీనియర్‌ మోస్ట్‌ పోలీసు అధికారిపై ఆగ్రహోదగ్ర జనం భౌతిక దాడికి దిగిన తీరు చూస్తే – వెంటనే ఆపద్ధర్మ ప్రభుత్వం పగ్గాలు చేతబట్టి, పరిస్థితులను చక్కదిద్దకపోతే ఈ పౌర సంక్షోభం పూర్తిగా చేయి దాటిపోయే ప్రమాదమైతే ఉంది.

వీటన్నిటికీ మూలమైన ఆర్థిక సంక్షోభం అతి పెద్ద సమస్య. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు, శూన్యమైన పర్యాటక ఆదాయంతో శ్రీలంక పీకలలోతు కష్టాల్లో ఉంది. రాజకీయ సంక్షోభం మాటెలా ఉన్నా, ఈ ఆర్థిక సంక్షోభం ఇప్పుడప్పుడే పరిష్కార మయ్యేది కాదు. పేరుకుపోయిన వందల కోట్ల డాలర్ల అప్పు తీరేదీ కాదు.

ఈ చిన్ని ద్వీపదేశం రాగల కొన్నేళ్ళలో ఏకంగా 5 వేల కోట్ల డాలర్లకు పైగా అప్పులు తీర్చాల్సిన తరుణంలో ఇప్పుడు కావాల్సింది దూరదృష్టి, దీర్ఘకాలిక పరిష్కారం. దేశంలో కరవు, ఆహార కొరత రాకుండా అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయడమే మార్గమంటున్నారు ఆర్థికవేత్తలు. ఉప్పూ నిప్పూగా ఉండే సింహళీయులు, తమిళులు ఇప్పుడు రాజపక్సీయుల పాలనను వ్యతిరేకించడంలో అనూహ్యంగా ఒక్కటైనట్టే, చట్టసభలోనూ కలసి ముందుకు సాగడం ఈ గడ్డుకాలంలో ముఖ్యం.  

చిత్రమేమిటంటే– చాలాకాలంగా శ్రీలంక, దాని పాలకులు చైనాతో చేతులు కలుపుకొని తిరిగినా, కరెన్సీ కష్టాల వేళ ఆ దేశం లంకేయుల వైపు కన్నెత్తి చూడకపోవడం! భారతదేశమే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంతా కలిపి 300 కోట్ల డాలర్ల మేర సింహళీయులకు సాయం చేసింది. మన ఆర్థిక మంత్రి అమెరికాలో సైతం శ్రీలంకకు నిధులు అందించాలంటూ ఐఎంఎఫ్‌ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను అభ్యర్థించారు. సిలోన్‌ను కేవలం పొరుగుదేశంగానే కాక హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరతలకు కీలక భాగస్వామిగా భారత్‌ చూస్తోంది. గతంలో శ్రీలంక త్రాసు చైనా వైపు మొగ్గడంతో నష్టపడ్డ భారత్‌ పోయిన పట్టు మళ్ళీ సాధించుకుంటోంది. 

రాజపక్సీయుల సంగతికొస్తే, గతంలో ఒకటికి రెండుసార్లు ఎన్నికల్లో మట్టికరిచినా, మళ్ళీ పైకి లేచిన సత్తా ఆ కుటుంబానిది. కానీ ఈసారి కుటుంబ పాలనతో కూడబెట్టిన అవినీతి, సంపాదించిన అపకీర్తి చూస్తే వారు ఇక అధికారాన్ని మర్చిపోవాల్సిందే. దేశాధ్యక్షుడు గొటబయ మాత్రం పెల్లుబు కుతున్న ప్రజాగ్రహాన్ని సైనికబలంతో అణిచివేయాలని దింపుడుకళ్ళెం ఆశతో ఉన్నారు.

ఎల్టీటీఈ అణచివేతలో పాత్రధారిగా, నిరంకుశ ‘టెర్మినేటర్‌’ పేరుపడ్డ ఆయన ఆ పట్టుతో కిరీటం కాపాడు కోవాలని శతవిధాల యత్నిస్తున్నారు. అయితే, సంక్షుభిత సింహళాన్ని సొంతకాళ్ళపై నిలబెట్టడం, ఆయన తన పీఠాన్ని నిలబెట్టుకోవడం – రెండూ ఇప్పుడు కష్టమే! 1930ల తర్వాత ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభం, 1953 నాటి మహా హర్తాళ్‌ తర్వాత మళ్ళీ అంతటి నిరసనల్లో చిక్కుబడ్డ శ్రీలంకలో కొన్నేళ్ళపాటు ఈ రావణకాష్ఠం కాలుతూనే ఉంటుందనేది నిపుణులు చెబుతున్న నిష్ఠురసత్యం.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement