కొత్త కొలమానాలేవి?

Sakshi Editorial On Postponed Of Cbse Exams

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలు కూడా రద్దయ్యాయి. పిల్లలు ఇంతటి విషమ పరిస్థితుల్లో తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిందేనా లేక రద్దవుతాయా అని అనేకులు మథనపడుతున్న సమ యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం వాటిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఐఎస్‌సీఈ కూడా ఈ పనే చేసింది. సీబీఎస్‌ఈ, ఇతర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను ఇప్పటికే రద్దుచేశాయి. ఇంటర్మీడియెట్‌ పరీక్షల విషయంలోనూ చాలా ప్రభుత్వాలు ఇలాగే నిర్ణయించాయి. బిహార్‌ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించింది. కేరళ పన్నెండో తరగతి పరీక్షలను ఏప్రిల్‌లో పూర్తిచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ఓపెన్‌ బుక్‌ విధానం ద్వారా ఈ నెల 1నుంచి పన్నెండో తరగతి పరీక్షలు మొదలుపెట్టింది. మరికొన్ని రాష్ట్రాలు దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది. పరీక్షల ద్వారానే తాము ఉత్తీర్ణత సాధిస్తామని ఎవరైనా విద్యార్థులు ముందుకొచ్చిన పక్షంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాక ఆ విషయాన్ని పరి శీలించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కరోనా మూడో దశ అంచనాలున్న నేపథ్యంలో ఈ అనిశ్చితి ఎన్నాళ్లుంటుందో ఎవరూ చెప్పలేరు. విద్యార్థుల ప్రతిభను నిర్ణయించటానికి దీర్ఘకాలంగా అమలు చేస్తున్న ప్రామాణిక వ్యవస్థ పరీక్షలే. ఉన్న ఆ ఒక్క విధానమూ రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడటం, వేరేవిధమైన కొలమానాలు లేకపోవటం దురదృష్టకరం. అలాగే ఇంటర్నెట్, విద్యుత్‌ సదుపాయాలు పల్లెసీమల్లో అరకొరగా వుండటం... అట్టడుగు వర్గాల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు లేక పోవటం ఆన్‌లైన్‌ విధానంపై నమ్మకం పెట్టుకోవటాన్ని అసాధ్యం చేసింది. ఆ పేరుతో నిరుడు, ఈ ఏడాది తరగతులు నిర్వహించినా చాలామందికి ఉపయోగపడింది లేదు. అలాగని మున్ముందు పరిస్థితులెలావుంటాయోనన్న అవగాహన లేకుండా, పరీక్షలు లేవని చాలాముందుగా ప్రకటించటం కూడా అవాంఛనీయమవుతుంది. ఎంతో కొంత శ్రద్ధ చూపించే పిల్లల్లో సైతం అది నిరాసక్తతకు దారి తీస్తుంది. తగిన సమయంలో అప్పటికున్న పరిస్థితులను సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవటమే సముచితం. పిల్లల ప్రాణాలు ముఖ్యమా, పరీక్షలు ముఖ్యమా అని కొందరు వాదించారు. ఆ రకంగా పిల్లల ప్రాణాలపై తమకు ఆదుర్దా వున్నదని చెప్పుకోవటానికి ప్రయత్నించారు. కానీ పిల్లలు ఎటూ చదువుకోవటం తప్పనిసరిగనుక పరీక్షలు వుంటాయన్న అభిప్రాయం కలగజేయటం వల్ల నష్టం లేదని, కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి పరీక్షల రద్దు అంశాన్ని  ప్రభుత్వాలు చివరిక్షణంలో నిర్ణయిస్తేనే సముచితమని మరికొందరు భావించారు.  

దేశంలో ప్రభుత్వాలు, నాయకులు ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటే  కరోనా మహ మ్మారి రెండో దశ ఇంతగా స్వైర విహారం చేసేది కాదు. ఎన్నికల కోసం వెంపర్లాడటం, ఎప్పటిలాగే భారీగా జనసమీకరణలు, కుంభమేళా నిర్వహణ వగైరాలు బాగా దెబ్బతీశాయి.  తొలి దశలో కరోనా కాటు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఉపాధి కరువై లక్షలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని తెలిసి కూడా ఎన్నికలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని, అందరికీ టీకాలు పూర్తయ్యాక నిర్వహిం చుకోవచ్చని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. న్యాయస్థానాలు సైతం నిబంధనల పేరు చెప్పి ఎన్నికల సంఘాన్నే సమర్థించాయి. కరోనా తీవ్రతను గమనించి తిరుపతి ఉప ఎన్నిక సమయంలో జగన్‌మోహన్‌ రెడ్డి తన ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. భారీ జనసమీకరణల కారణంగా దేశంలో కరోనా రెండో దశ ఉగ్రరూపం దాల్చింది. చివరకిప్పుడు విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేయకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. 

పదో తరగతి పరీక్షలు రద్దు చేసినప్పుడు మార్కుల షీట్‌లో కేవలం ఉత్తీర్ణతను మాత్రమే ప్రక టించాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించాయి. సీబీఎస్‌ఈ విభిన్నమైన విధానం ప్రకటించింది. పాఠశాలల వారీగా ఫలితాల కమిటీలను నియమించాలని, అందులో ఆ పాఠశాల సభ్యులతోపాటు బయటి విద్యాసంస్థల ప్రతినిధులుండాలని నిర్దేశించింది. యూనిట్‌ టెస్ట్‌లు, అర్థ సంవత్సర పరీ క్షలు, చివరగా నిర్వహించే పరీక్షలు, అంతర్గత మదింపు వగైరాలకు వంద మార్కులు నిర్ణయించి, దాని ప్రాతిపదికన విద్యార్థి ప్రతిభను లెక్కేయాలని తెలిపింది. అలాగే గత మూడేళ్లలో ఒక విద్యా సంస్థ పదో తరగతి పరీక్షల్లో ప్రదర్శించిన పనితీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆ పాఠశాలనుంచి ఉత్తీర్ణులైనవారికి నిర్దిష్టమైన పాఠ్యాంశాల్లో వచ్చిన సగటు మార్కుల ఆధారంగా వాటి పనితీరు కొలుస్తారు. ఇప్పుడు పన్నెండో తరగతికి ఏం చేస్తారన్నది అయోమయంగానే వుంది.  డిగ్రీ చదువులకెళ్లాల్సిన విద్యార్థులకు వారి ప్రతిభతోపాటు, వారు చదువుకున్న పాఠశాలల పనితీరు కూడా లెక్కేయటం అన్యాయమని వారు చెబుతున్నారు.  కొన్ని విద్యాసంస్థలు పరీక్షలకు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. మరికొన్ని ఉదారంగా వుంటాయి. ప్రశ్నపత్రాల తయారీలో అందరికీ ఒకే విధానం లేనప్పుడు పాఠశాల పనితీరును పరిగణించటం వల్ల విద్యార్థికి అన్యాయం జరగదా అన్న ప్రశ్న వస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులకు వెళ్లదల్చుకున్నవారికి ఎటూ ఎంట్రెన్స్‌ పరీక్షలుం టాయి. కానీ ఆర్ట్స్‌ కోర్సులకు ఎంపిక కేవలం పన్నెండో తరగతి పరీక్షల మార్కులే గీటురాయి. కనుక విద్యార్థి ప్రతిభను కొలిచేందుకు తీసుకొచ్చే ఏ విధానమైనా హేతుబద్ధంగా, ప్రామాణికంగా వుండేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఉన్నంతలో అందరికీ న్యాయం జరుగుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top