ఇమ్రాన్‌కు కష్టకాలం

Sakshi Editorial on Pakistan PM Imran Khan Faces Revolt

నిన్న మొన్న వరకూ పాకిస్తాన్‌ సైన్యానికి ఇష్టసఖుడిగా ఉన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పీఠం కదులుతున్న జాడలు కనబడుతున్నాయి. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికీ, ద్రవ్యోల్బణం కట్టుదాటడానికీ ఇమ్రానే బాధ్యుడంటూ ఇప్పటికే పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)లు పాకిస్తాన్‌ పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. వచ్చే సోమవారం దీనిపై చర్చ ప్రారంభం కాబోతుండగా ఈ నెల 28న తీర్మానంపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఆయన సొంత పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌(పీటీఐ) నుంచి 24 మంది ఎంపీలు తప్పుకొంటున్నట్టు కథనాలు వస్తుండగా, అధికార కూటమికి గుడ్‌బై చెబుతున్నట్టు మిత్రపక్షం ఒకటి ప్రకటించింది. ప్రస్తుతం పీపీపీ నాయకుడు, బేనజీర్‌ భుట్టో కుమారుడు బిలావల్‌ భుట్టో జర్దారీ సాగిస్తున్న ‘లాంగ్‌మార్చ్‌’ సరిగ్గా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగేనాటికి ముగుస్తుందంటున్నారు. కనుక ఇమ్రాన్‌ ఖాన్‌కు మున్ముందు వరస తిప్పలే. 324 మంది సభ్యులుండే జాతీయ అసెంబ్లీలో పీటీఐకి సొంతంగా 155 మంది సభ్యులున్నారు. ఆరు పార్టీలకు చెందిన 23 మంది మద్దతుంది. ప్రభుత్వ మనుగడకు కనీసం 172 మంది అవసరం. కనుక ఇప్పుడున్నవారిలో ఏడెనిమిదిమంది జారుకున్నా ఇమ్రాన్‌కు ముప్పు ముంచుకొచ్చినట్టే. నాలుగేళ్ల క్రితం సైన్యం ప్రాపకంతో అధికారంలోకొచ్చిన ఇమ్రాన్‌కు  అసంతృప్తి కొత్తగాదు. ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలూ పాతవే. ఈ సంక్షోభాలే విపక్షాలకు ఇంధనంగా ఉపయోగపడుతుంటాయి. సైన్యం ఆశీస్సులుంటే విపక్ష నిరసనలు హోరెత్తుతాయి. లేదంటే విపక్ష నేతలంతా జైలు పాలవుతారు. ఇమ్రాన్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి దాదాపు రెండేళ్లుగా ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్‌ ప్రజాస్వామ్య ఉద్యమం(పీడీఎం) పేరిట నిరుడు ఉద్యమం నడిచింది. సైన్యం ఇమ్రాన్‌ వెనక దృఢంగా నిలవడంతో అది చప్పున చల్లారింది. తాజాగా ‘అవిశ్వాస’ సెగ కూడా ఆ బాపతే కావొచ్చని అనేకులు అనుకుంటుండగా అది రోజురోజుకూ విస్తరిస్తున్న వైనం అధికార పక్షానికి చెమటలు పట్టిస్తోంది. 

అసలు పాకిస్తాన్‌కు ఏమైంది? రోజులు మారుతున్నాయనీ, వాటితోపాటు తమ స్థానమూ చెల్లాచెదురవుతున్నదనీ అక్కడి పాలకులు గ్రహించకపోవడమే ఆ దేశానికి శాపమైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అడిగిందే తడవుగా అమెరికా డాలర్ల వర్షం కురిపించేది. అప్పుడప్పుడు ప్రజామోదంతో అధికారంలోకొచ్చిన పాలకులున్నా... ఆ ప్రభుత్వాలను కూలదోసి అధికార పీఠం సొంతం చేసుకున్న సైనికాధినేతలకు కొదవలేదు. అయూబ్‌ ఖాన్, యాహ్యా ఖాన్‌ మొదలు జియా వుల్‌ హక్, పెర్వేజ్‌ ముషార్రఫ్‌ వరకూ ఇందుకు ఉదాహరణలు. జియా అయితే అప్పటి ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టోను కూలదోసి తప్పుడు ఆరోపణలతో ఖైదు చేయడమే కాదు... విచారణ తతంగం నడిపి ఉరి తీయించాడు. కానీ సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలి అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యం ఏర్పడ్డాక, ప్రపంచీకరణ తర్వాత పాకిస్తాన్‌ ప్రాభవం క్షీణించడం మొదలైంది. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సాగించిన ఎడతెగని యుద్ధంలో తలబొప్పి కట్టి, అఫ్గాన్‌ నుంచి తప్పుకున్నాక అమెరికాకు పాకిస్తాన్‌తో మునుపటంత అవసరం లేకుండా పోయింది. పైగా అమెరికాకు మన దేశం మిత్రపక్షమైంది. అమెరికా స్థానంలో చైనా వస్తుందనీ, దాన్నుంచి పుష్కలంగా సాయం అందుతుందనీ పాకిస్తాన్‌ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అడిగినంత ఆర్థిక సాయం అందిస్తూనే, ఏమేం చేయాలో శాసించడం చైనాకు అలవాటు. ఇచ్చిన సొమ్ముకు మరిన్ని రెట్లు వసూలు చేయడం ఆనవాయితీ. అదే ఇమ్రాన్‌ కొంప ముంచింది. ఆదాయంలో అత్యధికం వడ్డీల చెల్లింపులకే పోతుంటే ఆయన ప్రభుత్వానికి కాళ్లూ చేతులూ ఆడలేదు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికీకరణ  వంటివి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురికావడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణంతో రూపాయి చిక్కుతోంది. ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం అమాంతం పెరిగింది. మధ్య తరగతి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. చుట్టుముట్టిన ఈ సంక్షోభాల నుంచి బయటపడేందుకు దారీ తెన్నూ తోచక ఇమ్రాన్‌ ఊపిరాడకుండా ఉన్నారు. 

వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్‌ సైన్యం పాత్రే ప్రధానమైనది. ఇమ్రాన్‌ను ముందుపెట్టి వెనకనుంచి అది సాగించిన మంత్రాంగమే దీనికంతా మూలం. చేసిందంతా చేసి ఇప్పుడు తనకేమీ సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వానికి అండగా సైన్యం ముందుకు రావాలనీ, విపక్షాల నిరసనను అణిచేయాలనీ పాకిస్తాన్‌ సమాచార మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ బహిరంగ ప్రకటన ద్వారా మొర పెట్టుకోగా, ‘దేశ రాజకీయాల్లో మా జోక్యం ఉండద’ంటూ సైన్యం బదులు పలికింది. పైగా తాము మొదటినుంచీ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామని గుర్తుచేసింది. సారాంశంలో ఇమ్రాన్‌ను బలిపశువును చేయడానికే అది సిద్ధపడిన సూచనలు కనబడుతున్నాయి. ఇదంతా అంతిమంగా తమ శత్రువు నవాజ్‌ షరీఫ్‌కు లాభిస్తుందనుకుంటే సైన్యం వెనక్కి తగ్గినా ఆశ్చర్యం లేదు. ఏతా వాతా తాము ఇష్టపడి గద్దెనెక్కించిన ఇమ్రాన్‌ భవితవ్యం ఇప్పుడు సైన్యం చేతుల్లో ఉంది. దాని ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయట పడనంతవరకూ పాకిస్తాన్‌ రాత మారదు. ఆ దేశాన్ని చుట్టుముట్టిన సంక్షోభాలూ సమసిపోవు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top