మరో మేలుకొలుపు!

sakshi editorial on Covid New Variant Omicron - Sakshi

ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా వైరస్‌ కొత్త రూపం ‘ఒమిక్రాన్‌’ వల్ల తీవ్ర పరిణామాలతో కరోనా మళ్ళీ విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఒ) సోమవారం నాటి హెచ్చరిక కలవరపెడుతోంది. శరవేగంగా విస్తరించే ఈ కొత్త వేరియంట్‌తో ప్రమాదమూ తీవ్రమేనట. పలు దేశాల్లో ఇప్పటికే ఈ కొత్త రూపం వైరస్‌ బయటపడడంతో మళ్ళీ షరతులు మొదలయ్యాయి. జపాన్‌ సహా కొన్ని దేశాలు అంతర్జాతీయ విమానాలను నిషేధించేశాయి. భారత్‌లో ఒమిక్రాన్‌ జాడ ఇంకా బయటపడనప్పటికీ, దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినవారిలో పలువురు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడం కలవరపెడుతోంది. వెరసి, కరోనా జాగ్రత్తలు, టీకాలపై నిర్లక్ష్యం ప్రబలుతున్న భారత్‌ ఇప్పుడు నిద్ర మేల్కొనక తప్పదు.

ఇప్పటి వరకు డబ్లు్యహెచ్‌ఒ 5 వేరియంట్‌ (ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్‌)లను ఆందోళనకరమైనవిగా, 2 వేరియంట్లను (లాంబ్డా, మ్యూ) ఆసక్తికరమైనవిగా పేర్కొంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో కేవలం 7 నుంచి 10 రోజుల్లో డెల్టా వేరియంట్‌ను కనిపించకుండా చేసి, సర్వత్రా తానే అయింది ఒమిక్రాన్‌. కోవిడ్‌ చికిత్సలో యాంటీ బాడీస్‌ పనిచేసేది వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌పైన. ఏడాది క్రితం మహారాష్ట్రలో బయటపడ్డ మునుపటి వైరస్‌ రూపం డెల్టాలో డజను ఉత్పరివర్తనాలే. కానీ, ఏకంగా 50కి పైగా ఉత్పరివర్తనాలతో, ఒక్క స్పైక్‌ ప్రొటీన్‌లోనే 32 ఉత్పరివర్తనాలతో ఒమిక్రాన్‌ తయారైంది. అందువల్ల వేసుకున్న టీకాలను సైతం తప్పించుకొని, శరీరంపై దాడి చేసే సత్తా దానికుందని అనుమానం. అంటే, టీకాల్లో విజయం సాధించామంటున్న దేశాలు, రెండు డోసులూ వేసుకున్నవారు సైతం జాగ్రత్త పడక తప్పదు. కాలగతిలో యాంటీ బాడీస్‌ తగ్గే అవకాశం ఉంది గనక, అదనపు బూస్టర్‌ డోస్‌ అవసరమనే వాదన ఇప్పుడు భారత్‌లోనూ బలం పుంజుకుంది. 

అజాగ్రత్త వహిస్తే, టీకాలు వేసుకున్నవారికి సైతం మళ్ళీ కరోనా వచ్చే రిస్కు ఒమిక్రాన్‌లో ఎక్కువేనంటున్నారంటే ఎంతటి జాగ్రత్త అవసరమో అర్థం చేసుకోవచ్చు. శతకోటి టీకా డోసుల సంబరం తర్వాత పాలకుల్లోనూ, కేసులు తగ్గాయి లెమ్మని ప్రజల్లోనూ అలక్ష్యం పెరిగినమాట నిజం. గత మూడు నెలల్ని పోలిస్తే, దేశంలో పదుల శాతంలో తగ్గిన టీకా డోసుల గణాంకాలే అందుకు నిదర్శనం. 80 శాతం మందికి పైగా వయోజనులకు ఒక డోసైనా అందింది కానీ, మళ్ళీ రెండో డోసుకు వస్తున్నవాళ్ళు తక్కువే. ఒక్క యూపీలోనే కోటి మందికి పైగా రెండో డోసు తీసుకోలేదు. అందుకే, కొత్త కోవిడ్‌ వేరియంట్‌ వల్ల సమీప భవిష్యత్తులో భారత్‌ సహా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై దుష్ప్రభావం తప్పకపోవచ్చు. మోర్గాన్‌ స్టాన్లీ తాజా పరిశోధన ఆ మాటే చెప్పింది. పరిస్థితి తీవ్రమైతే లాక్డౌన్ల బెడదా లేకపోలేదంది. ఇక, దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్‌ జట్టు పర్యటన సహా చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రపంచ శ్రేణి క్రీడోత్సవాలకూ ఇక్కట్లు తప్పేలా లేవు.

వైరస్‌ జన్యునిర్మాణాన్ని కనిపెట్టే జన్యు అనుక్రమణం కీలకమని ఒమిక్రాన్‌ మరోసారి గుర్తు చేసింది. జన్యు అనుక్రమణ శోధనలపై దక్షిణాఫ్రికా భారీగా పెట్టుబడి పెట్టడం వల్లే ఒమిక్రాన్‌ను కనిపెట్టడం, తక్షణమే ప్రపంచాన్ని అప్రమత్తం చేసి, చర్యలు చేపట్టడం సాధ్యమైంది. అవసరమైతే కొత్త వైరస్‌ రూపానికి తగ్గట్టు టీకాల్ని ఆధునికీకరించడానికీ ఈ శోధనలు కీలకం. కానీ ఇలా శోధించి, ఫలితాలను పారదర్శకంగా బయటపెట్టినందుకు ప్రయాణాలపై నిషేధం లాంటి ఇక్కట్లకు అవి గురి అవుతున్నాయి. అందుకే, ఆర్థికంగా తమను దెబ్బతీసే ప్రయాణ నిషేధాలు ఎత్తివేయాలనీ, తమ లాంటి దేశాలకు ప్రపంచస్థాయిలో పరిహారం చెల్లించాలన్న దక్షిణాఫ్రికా వాదన సబబే అనిపిస్తుంది. 

మరోపక్క అందరికీ టీకాలందితే తప్ప, ఏ ఒక్కరమూ సురక్షితం కాదనేది ప్రాథమిక సూత్రం. కానీ, సంపన్న దేశాలు ఖర్చు కాని టీకాలను తమ దగ్గర పోగేసుకుంటున్నాయే తప్ప, అల్పాదాయ దేశాలకు అందించడం లేదు. సంపన్నదేశాల్లో 60 శాతం మందికి టీకా పూర్తయితే, అల్పాదాయ దేశాల్లో కేవలం 3 శాతానికే టీకాలు అందడం శోచనీయం. మూడో డోసుకు ఆరాటపడుతున్న సంపన్న దేశాలు, ఆఫ్రికా లాంటి వాటికి అవసరమైన టీకాలే అందించలేదు. ఇది నైతికంగా తప్పే కాక, టీకాను సైతం తట్టుకొనే వైరస్‌ రూపొందే ముప్పుంది. అందుకే, వాడని టీకాలను వర్ధమాన దేశాలకు ముందుగా పంపే సమర్థ వ్యవస్థను సంపన్న దేశాలు అభివృద్ధి చేసుకోవడం అవసరం. భారత్‌ సైతం టీకా మైత్రి కింద అంతర్జాతీయ వేదిక కోవాక్స్‌కు మరిన్ని టీకాలను సరఫరా చేయాలి. 

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆలస్యంగా మొదలుపెట్టి దీర్ఘకాలం కఠినమైన షరతులు విధించే బదులు, ముందే కళ్లు తెరవడం మేలు. కరోనా జాగ్రత్తల్లో తాజా నిర్లక్ష్య వైఖరిని ప్రజలు తక్షణమే మార్చుకోక తప్పదు. టీకాలపై నిరాసక్తతనూ, తటపటాయింపునూ వదిలించుకోక తప్పదు. ఐరోపాలో 60 ఏళ్లు పైబడినవారిలో 4.7 లక్షల మంది ప్రాణాలు దక్కాయంటే, అది టీకాల వల్లనే అని డబ్లు్యహెచ్‌ఒ తాజా అధ్యయనం. టీకా తప్పనిసరి అని చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. గుమిగూడడంపై షరతులు, భౌతికదూరం, మాస్కు ధారణ, టెస్టింగు లాంటి ప్రాథమిక జాగ్రత్తలే మళ్ళీ శరణ్యం. వెల్లువెత్తుతున్న భయాలకు విరుద్ధంగా ఒమిక్రాన్‌ పెద్దగా ప్రభావం చూపకూడదనే ఆశిద్దాం. గతంలో పలు ఉత్పరివర్తనాల బీటా వేరియంట్‌ పెద్దగా ప్రభావం చూపనట్టే, ఇదీ అయితే అదృష్టమే. కానీ, ఇప్పటికీ మహమ్మారి పీడ ముగిసిపోలేదని గ్రహించాలి. అందుకే, ప్రపంచానికి మరోసారి పారాహుషార్‌ – తాజా వేరియంట్‌ ఒమిక్రాన్‌! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top