ప్రజాస్వామ్య పరిహాస క్రీడ | Sakshi Editorial About Brazil Ex-president-bolsonaro-Supporters Protest | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిహాస క్రీడ

Jan 13 2023 1:12 AM | Updated on Jan 13 2023 6:53 AM

Sakshi Editorial About Brazil Ex-president-bolsonaro-Supporters Protest

కింద పడ్డా పైచేయి నాదే అనడమంటే ఇదే. బ్రెజిల్‌లో ఎన్నికల తుది ఫలితాలొచ్చి రెండున్నర నెలలైనా వాటిలో మతలబు ఉందంటున్న తాజా మాజీ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మాటలు, ఆయన మద్దతుదారుల చేష్టలు అచ్చంగా అలాగే ఉన్నాయి. ఆ దేశ రాజధాని బ్రసీలియాలోనే సైనిక శిబిరాల సమీపంలో మకాం వేసిన బోల్సనారో భక్తులు సైనిక జోక్యంతోనైనా కొత్త దేశాధ్యక్షుడైన వామపక్ష లూలాను పదవి నుంచి తప్పించాలని పట్టుబట్టడం విడ్డూరం. పది వారాలైనా ఫలితం లేక వందల మంది జనవరి 8వ తేదీ ఆదివారం విధ్వంసానికి దిగిన దృశ్యాలు నివ్వెరపరుస్తున్నాయి. 

ఎన్నికల ప్రక్రియపై బురద జల్లి, ప్రజాస్వామ్యానికి పాతర వేసే ప్రయత్నాలు ఆందోళనకరం. సరిగ్గా రెండేళ్ళ క్రితం అధ్యక్ష ఎన్నికల అనంతరం అమెరికాలో జరిగిన పరిణామాలను బ్రెజిల్‌లోని తాజా దాడులు గుర్తుచేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి పాలైనప్పుడు 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు ఇలాగే వ్యవహరించారు. వాషింగ్టన్‌లోని ఆ దేశ పార్లమెంట్‌ భవనంపై వారు దాడికి దిగితే, తాజాగా బ్రెజిల్‌లో బోల్సనారో సమర్థకులు అధ్యక్ష భవనం, పార్ల మెంట్‌ భవనం, సుప్రీమ్‌ కోర్ట్‌లలో చొరబడి, విధ్వంసం సృష్టించారు. ఓటమి పాలయ్యాక జనంలోకి రాకుండా కాలక్షేపం చేస్తున్న బోల్సనారో జనవరి 1న లూలా పదవీ ప్రమాణానికి రెండు రోజుల ముందే అమెరికాకు చెక్కేశారు. కొత్త దేశాధ్యక్షుడికి దండాన్ని అందించే సంప్రదాయాన్నైనా పాటించక ముఖం చాటేయడం ఆయన మనోభావాలకీ, వాస్తవ నిరాకరణ దృక్పథానికీ అద్దం. 

గత అక్టోబర్‌ 30న ముగిసిన బ్రెజిల్‌ ఎన్నికల్లో అతివాద ఛాందస నాయకుడు, అప్పటి దేశాధ్య క్షుడు బోల్సనారో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దేశానికి మరోసారి ఘనకీర్తి కట్టబెడతానని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన ఆయన ఓ పట్టాన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటకొస్తే ఎన్నికల్లో ఓటమికి చాలాకాలం ముందు నుంచే ఆయన ఓ పల్లవి అందుకున్నారు. తానంటూ తిరిగి ఎన్నిక కాకపోతే, అది ఎన్నికల్లో మోసం వల్లేనని పాట పాడసాగారు. ప్రజాతీర్పు ప్రతికూలంగా వచ్చాకా ఆ మాటే ప్రచారంలో పెడుతున్నారు. ఆయన సమర్థకుల్లో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు – ధని కులు, పేదలు – యువకులు, వృద్ధులు... ఇలా అందరినీ కలిపిన సూత్రం – కమ్యూని జమ్‌పై విద్వేషం. అంతా కలసి పార్లమెంటరీ చిహ్నాలపై దాడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. 

ఈ ఘర్షణల్లో తన ప్రమేయం లేదని బోల్సనారో చేతులు దులుపుకొంటున్నారు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలు విరుద్ధంగా ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ‘దొంగలు’గా పేర్కొంటూ, తాను ఓడిపోతే హింస తప్పదని ఎన్నికలప్పుడే ఆయన సెలవిచ్చారు. ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి నేటికీ సాగుతున్న ఆయన సమర్థకుల నిరసనలు, విధ్వంసాలు అందుకు ఆచరణరూపమే. వాట్సప్, టెలిగ్రామ్‌ ద్వారా అనేక రోజుల క్రితమే ఈ దాడులకు వ్యూహం, నిర్వహణ జరిగిందట. బ్రెజిల్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి పదులకొద్దీ బస్సుల్లో వచ్చి, విధ్వంసం రేపిన వ్యక్తుల వెనుక బోల్సనారో పాలనలో యథేచ్ఛగా సాగిన పర్యావరణ విధ్వంసక వర్గాల డబ్బు ఉందనీ వినిపిస్తోంది. ప్రజా స్వామ్య పాలనను అడ్డుకోవాలనే ఈ తెర వెనుక వ్యక్తుల వ్యవహారం మరింత ఆందోళనకరం. 

రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసి, 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కల్పించిన చరిత్ర లూలాది. కమ్యూనిజాన్ని బూచిగా చూపి, అవినీతి ముద్ర వేసి ఓటర్ల దృష్టి మరల్చి, పబ్బం గడుపుకోవాలన్న బోల్సనారో పాచిక తాజా ఎన్నికల్లో పారలేదు. అదీ స్వయంకృతమే. దేశంలో 7 లక్షల పైగా మరణాలతో కరోనా కట్టడిలో వైఫల్యం, అమెజాన్‌ అడవుల నరికివేత, కునారిల్లిన ఆర్థిక వ్యవస్థ వగైరా ఆయనకు శాపాలయ్యాయి. అయితే, వర్గాలుగా చీలిన సమాజంలో లక్షలాది ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై అపనమ్మకం, లూలా అన్నా, వామపక్షమన్నా లేనిపోని భయం కలిగించడంలో బోల్సనారో కొంత విజయవంతమైనట్టే ఉన్నారు. ఇప్పుడదే దేశానికి పెనుశాపం. తాజా విధ్వంసాలను ఆ కోణంలోనూ చూడాలి. బాధ్యులను గుర్తించి, దురంతాలను ఉక్కుపాదంతో అణచాలి. 

1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్‌ బయటపడినా, బోల్సనారోకు సైనిక నియంతృత్వం పైనే మక్కువ. ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం లేని ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర మితవాదులతో, సంపన్న వర్గాలతో అంటకాగారు. ఆ ప్రయోజనాలకు లూలా అడ్డు అన్నదే ఆయన కడుపు మంట. ఈ సవాలును కొత్త అధ్యక్షుడు ఎంత సమర్థంగా ఎదుర్కొంటారో చూడాలి. ఫాసిస్టు ధోరణులకు అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం, గౌరవం కలిగించడం తక్షణ లక్ష్యం. ట్రంప్‌ ప్రవర్తన నుంచి ప్రేరణ పొందిన బోల్సనారో ఇకనైనా మూర్ఖత్వం వీడాలి. ఓటమిని హుందాగా అంగీకరించాలి. రాజ్యాంగానికి కట్టుబడేలా తన మద్దతుదారులకు నచ్చజెప్పాలి. 

ఆగని ఈ ఎన్నికల సంక్షోభం నుంచి ఎంత తొందరగా బయటపడితే 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ అంత మంచిది. ‘బ్రిక్స్‌’ గ్రూపులో çసభ్యదేశంగా, ద్వైపాక్షికంగా బ్రెజిల్‌తో భారత్‌కు సత్సంబంధాలు న్నాయి. బోల్స్‌నారోను గతంలో మిత్రుడిగా భావించిన ప్రధాని మోదీ సైతం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన తాజా ఘటనల్ని ఖండించారు. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్యాలూ ముందుకొచ్చి, మితవాద విద్రోహులకు ఊతమివ్వబోమని తెలిసేలా చేయాలి. ప్రజాస్వామ్య సుస్థిరతకు భంగం కలిగే ఏ పరిణామం వాంఛనీయం కాదు. ఎందుకంటే, బ్రెజిల్‌ హింసాత్మక గతాన్ని విస్మరించలేం. నియంతృత్వాలకూ, నిరంకుశత్వానికీ పేరుబడ్డ దక్షిణ అమెరికాలో కేవలం కొన్ని పదుల వసంతాల ఈ యువ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రజలు, పార్టీలదే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement