Illegal Loan Apps: దారుణానికి అడ్డుకట్ట!

RBI To Make Whitelist Of Lending Loan Apps Crackdown Illegal Apps - Sakshi

అప్పులిస్తున్నామంటూ అమానవీయంగా ప్రవర్తిస్తున్న చట్టవిరుద్ధమైన డిజిటల్‌ యాప్‌లకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుందా? ఆర్థిక మంత్రి సారథ్యంలో గత వారం జరిగిన సమావేశం ఆ మేరకు ఆశలు రేపుతోంది. దేశంలో సాధారణ బ్యాంకింగ్‌ మార్గాలకు వెలుపల చట్టవిరుద్ధంగా నడుస్తున్న డిజిటల్‌ రుణ వేదికలపై మరిన్ని చర్యలకు కేంద్రం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నడుం బిగించాయి. చట్టబద్ధంగా రుణాలిచ్చే సవ్యమైన యాప్‌లతో జాబితాను సిద్ధం చేసే బాధ్యతను ఆర్బీఐకి అప్పగించారు. ఇక ఆ ‘శ్వేతజాబితా’లోని యాప్‌లే డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ – ఐటీ శాఖ జాగ్రత్తలు తీసుకోనుంది. అందుకోసం గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌స్టోర్‌ లాంటి వాటికీ, ఆర్బీఐకీ మధ్య సమన్వయం చేయనుంది. అలాగే, పేమెంట్‌ యాగ్రిగేటర్లు నిర్ణీత కాలవ్యవధి లోపల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలి. రిజిస్టర్‌ కాని వాటిని ఆ తర్వాత అనుమతించరాదనేది తాజా నిర్ణయం. వేల కుటుంబాలు కూలిపోవడానికి కారణమైన లోన్‌ యాప్‌లపై వేటుకు ఇవి తొలి అడుగులుగా భావించవచ్చు. 
దేశంలోని వేగవంతమైన డిజిటలీకరణ, మారుమూలలకు సైతం వ్యాపించిన మొబైల్‌ సర్వీసు లకు విపరిణామం ఈ లోన్‌ యాప్‌ల తంటా. అవసరంలో ఉన్న అల్పాదాయ, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకొని అప్పులు, సూక్ష్మ రుణాలు ఇచ్చే అక్రమ యాప్‌ల దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల సాంకేతిక నిరక్షరాస్యత వాటికి వాటంగా మారింది. అత్యధిక వడ్డీ రేట్లు, పైకి కనిపించని రుసుములు, బాకీ వసూళ్ళ పేరిట బ్లాక్‌మెయిలింగ్‌లకు ఇవి పేరుమోశాయి. అడ్డూ అదుపూ లేని ఈ డిజిటల్‌ రుణ యాప్‌లలో అత్యధికం చైనావే. ఇవి తక్షణ రుణాలు ఇస్తామంటూ లక్షలాది వినియోగ దార్లను వలలో వేసుకుంటున్నాయి. అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కస్టమర్లు తీసుకున్న రుణా లపై వడ్డీలకు వడ్డీలు వేస్తూ, వాటి వసూలుకై రాక్షసరూపం దాలుస్తున్నాయి. ఈ డిజిటల్‌ యాప్‌ల రుణ వసూలు ఏజెంట్ల  ముందు అలనాటి నక్షత్రకులు సైతం దిగదిడుపే. అప్పు తీసుకొనేందుకు సదరు యాప్‌లకు ఫోన్‌లోని నంబర్లు, ఫోటోలను అందుబాటులోకి తేవడం కొంపముంచుతోంది. వెంటాడి, వేధించే వారి మాటలు, చేష్టలు, అసభ్య మెసేజ్‌లు, మహిళల మార్ఫింగ్‌ ఫోటోలతో చివరకు పరువు పోయిందనే వేదనతో దేశవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు తీసుకున్నారు. 

డిజిటల్‌ రుణ యాప్‌లపై 2020 జనవరి నుంచి గత ఏడాది మార్చి వరకు రెండున్నర వేలకు పైగా ఫిర్యాదులు ఆర్బీఐకి అందాయి. దరిమిలా పరిశీలనలో రిజిస్టర్‌ కాని లోన్‌ యాప్‌లు దాదాపు 600కు పైగానే గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్నట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంపై రేగిన రచ్చతో గూగుల్‌ సైతం చర్యలు చేపట్టక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి తమ ప్లే స్టోర్‌లో 2 వేలకు పైగా వ్యక్తిగత రుణాల యాప్‌లను తొలగించినట్టు గత నెలలో ఆ సంస్థ ప్రకటించింది. అంటే, వ్యక్తిగత రుణ విభాగంలోని మొత్తం యాప్‌లలో దాదాపు సగానికి పైచిలుకు గూగుల్‌ తొలగించిందన్న మాట. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యాప్‌ ఆధారిత తక్షణ రుణాల్లో అవకతవకలు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టికీ వచ్చాయి. అందుకే ఇటీవల బెంగళూరులోని రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ తదితర ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వేల కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. 

లోన్‌యాప్‌లతో పైకి కనిపించని ప్రమాదాలెన్నో! వీటి కార్యకలాపాలతో అక్రమ నగదు తర లింపు, పన్నుల ఎగవేతకు వీలుంది. వ్యక్తిగత డేటా చౌర్యం, డొల్ల కంపెనీలు, కార్యకలాపాలు ఆపే సిన బ్యాకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల) దుర్వినియోగం విచ్చలవిడిగా సాగే ముప్పుంది. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. నిజానికి, నియంత్రణ లేని ఈ యాప్‌ల బారి నుంచి సామాన్య ప్రజలను కాపాడాలంటే, వాటిని నిషేధిస్తూ కేంద్రం ఓ చట్టం తేవాలని ఆర్బీఐ ఇటీవల సిఫార్సు చేసింది. చట్టపరమైన అనుమతులున్న, ఆర్బీఐ నియంత్రణలోని సంస్థలే అప్పులివ్వాలని నెల రోజుల క్రితం ఆగస్ట్‌ 10న నియంత్రణ చట్రాన్ని నిర్దేశించింది. అలాగే, డిజిటల్‌ రుణాలను నేరుగా రుణగ్రహీతల బ్యాంక్‌ ఖాతాల్లోనే జమ చేయాలనీ, మూడోవ్యక్తి ద్వారా కానే కాదనీ స్పష్టం చేసింది.

రానున్న రోజుల్లో చట్టవిరుద్ధమైన రుణ తిమింగలాలను యాప్‌ స్టోర్లలో అనుమతించనంత మాత్రాన అంతా మారిపోతుందనుకోలేం. యాప్‌లను పక్కదోవన లోడ్‌ చేసేలా లొసుగులున్నాయి. యాప్‌ స్టోర్లతో పని లేకుండా నేరుగా లింక్‌ పంపి, దాన్ని నొక్కితే సరిపోయే వీలుంది. అందుకే, కస్ట మర్లు, బ్యాంక్‌ ఉద్యోగులు, చట్టాన్ని పరిరక్షించే విభాగాల దాకా అందరికీ సైబర్‌ వ్యవహారాలపై చైతన్యం కలిగించడం ముఖ్యం. చట్టవిరుద్ధంగా చెలరేగిపోతున్న యాప్‌లకు ముకుతాడు వేసేలా సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థలు తగు చర్యలు చేపట్టాలి. ఆర్థిక మోసాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పరిష్కార కేంద్రం పెట్టడం లాంటివీ యోచించాలి. 

ఫిన్‌టెక్‌ సంస్థలు సైతం తమ వ్యాపార నమూనాలను సమీక్షించుకొని, పారదర్శక విధానం వైపు సాగాలి. కట్టాల్సివచ్చే రుసుములు వగైరా ముందే స్పష్టం చేయాలి. దాని వల్ల తెలుసుకొని మరీ కస్ట మర్లు నిర్ణయం తీసుకోగలుగుతారు. అదే సమయంలో పారదర్శకత వదిలేసి, ‘శ్వేత జాబితా’ పేరిట సంక్లిష్ట ప్రమాణాలను పెట్టి, న్యాయబద్ధమైన లోన్‌యాప్‌లను ఆర్బీఐ తొలగించకూడదు. సరైన పద్ధతులు అనుసరిస్తూనే, అనుమతించినా, నిరాకరించినా కారణాలూ పేర్కొనడం ముఖ్యం. అప్పుడే నిఖార్సయిన యాప్‌లకు చిక్కులు లేకుండా, దారుణ యాప్‌ల కథ కంచికి చేరుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top