రాజధాని నిండా రాకాసి గాలి

National Capital Delhi Dangerous Air Quality - Sakshi

రాజకీయాలు కలుషితమయ్యాయనే ఆవేదన వింటుంటాం. కానీ, కాలుష్యం మీదా రాజకీయాలు సాగుతున్న పరిస్థితి దేశ రాజధానిలో చూస్తున్నాం. ఢిల్లీలోని వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి వచ్చింది. రాగల మూడు రోజులు దారుణంగా ఉంటాయని వార్త. అదే సమ యంలో ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీని ఏలుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ల మధ్య రాజకీయ మాటల యుద్ధం ఏవగింపు కలిగిస్తోంది. పాలన గాలికొదిలేసి, పీల్చేగాలి కూడా సవ్యంగా లేకుండా చేస్తున్న ప్రబుద్ధులు ఆరోపణల పర్వంలో మాత్రం పైచేయి కోసం ప్రయత్నించడం విచారకరం. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్‌)లో కాలుష్యానికి వాహనాలు, పంట వ్యర్థాల దహనం, దీపావళి టపాసులు, పరిశ్రమలు, గాలి వేగం లాంటి భౌగోళిక పరిస్థితులు – ఇలా ఎన్నో కారణాలు. ప్రతి ఏటా శీతకాలం మొదలయ్యేసరికి హాయిగా శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఏళ్ళ తరబడిగా వేధిస్తున్నా తగు చర్యలు తీసుకోకపోవడం స్థానిక, కేంద్ర ప్రభుత్వాల సమష్టి వైఫల్యం. 

ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఒకటి. కళ్ళెదుట ఉన్నది కనిపించనివ్వని దట్టమైన పొగమంచు, దుమ్మూధూళి, పొగ, మసి. ప్రతి శీతకాలంలో లానే ఈసారీ నగరం ఓ విషవాయు గృహంగా మారింది. ఉత్తరాదిలో రోజూ వేలల్లో సాగుతున్న పంట వ్యర్థాల దహనం, ఇతర కాలుష్యాలు మహానగర వాయునాణ్యతను గురువారం సైతం ‘అత్యంత ప్రమాదకర స్థాయి’లో నిలిపాయి. ఒంట్లోని రక్తంలోకీ ప్రవేశించేటంత సూక్ష్మమైన, ప్రమాదభరిత ధూళికణాలు పిఎం2.5 సగటున ప్రతి ఘనపు మీటర్‌లో 588 ఉన్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన దానికన్నా ఇది 40 రెట్లు ఎక్కువ. ఢిల్లీలోనే కాదు, దేశంలో అనేక నగరాల్లో పీల్చేగాలి విషతుల్యమైందన్న కాలుష్య నివారణ మండలి మాట దిగ్భ్రాంతికరం.  

పొరుగున పంజాబ్‌లోని పొలాల్లో వరి పంట వగైరా కోయగా మిగిలిన దుబ్బులను తగలబెట్టడంతో ఢిల్లీ విషవాయు నగరిగా మారుతోందంటూ, ఢిల్లీ, పంజాబ్‌లను రెంటినీ పాలిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని కేంద్ర పర్యావరణ మంత్రి దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు కాలుష్య నియంత్రణకు స్మోక్‌ టవర్ల ఏర్పాటు, చెట్ల పెంపకం, నీటి జల్లులు సహా చేయగలిగినదంతా చేస్తున్నామంటున్నారు. రాజకీయాలు అటుంచితే, ఢిల్లీలో ఏటా ఈ సమస్య తలెత్తుతుండడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎవరు కాదన్నా మహానగరిలోని ఈ కాలుష్యానికి వరి మోళ్ళ దహనం దోహదం చేస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి రాక ముందు అంతా అక్కడి రైతుల పాపమే అన్న ఆప్‌ ఇప్పుడక్కడ అధికారంలో ఉండీ, నివారించలేకపోతోంది. పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లోని రైతులు ఇతర మార్గాలను అనుసరించేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత నెల రోజుల్లో ఈ దుబ్బులు కాల్చడం ఎక్కువైంది. 

దీనికి కారణాలు చాలానే. నీటి అవసరం ఎక్కువైన వరిసాగు వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తా యంటూ పంజాబ్‌ లాంటి చోట్ల మేలో పంట వేయడంపై నిషేధం పెట్టారు. వర్షాలొచ్చాక జూన్‌ మధ్యలో ఆలస్యంగా నాట్లు వేయడంతో, అక్టోబర్‌ ఆఖరులో కానీ పంట చేతికి రాదు. ఆ వెంటనే రబీ సీజన్‌కు వారమే వ్యవధి. దాంతో, త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేసేందుకు మోళ్ళను కాల్చడమే రైతుకు మార్గమవుతోంది. అప్పుడే ఉత్తరాదిలో చలికాలం. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వాయువేగం తగ్గుతుంది. వెరసి, కాలుష్యం పెరుగుతోంది. అదే గనక మేలోనే పంట వేయనిస్తే, సెప్టెంబర్‌కే చేతికొస్తుంది. అప్పటికి ఉష్ణోగ్రతలు, గాలి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సమస్య తీవ్రంగా ఉండక పోవచ్చు. అలాగే, పంజాబ్‌లో అధిక శాతం రైతులు నిరుపేదలు కావడంతో కాల్చడానికి బదులు కొయ్యకాళ్ళను తొలగించే యంత్రాలను వాడే స్థోమత లేదు. పైపెచ్చు, ఇతర ప్రత్యామ్నాయాలన్నీ శ్రమతో కూడినవి. అందుకే వ్యర్థాలను కాల్చడాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది గ్రహించి, ఈ పద్ధతిని మార్చడంపై అత్యవసరంగా పాలకులు, వ్యవసాయ నిపుణులు దృష్టి పెట్టాలి. 

ఒక్క శీతకాలంలోనే కాదు... ఏడాది పొడుగూతా ఎన్సీఆర్‌లో సగటున పిఎం2.5 గరిష్ఠ పరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటోంది. ఇది ఆందోళనకరం. ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 400 మార్కును దాటేయడంతో ఆరోగ్యవంతులకూ ప్రమాద ఘంటిక. 2021 నుంచి ఎన్సీఆర్‌లో కొన్ని చర్యలు చేపట్టకపోలేదు. వాయునాణ్యత నిర్వహణకు కమిషన్‌ పెట్టారు. రోజూ ఏక్యూఐ నమోదు, ఎప్పటికప్పుడు వచ్చే కాలుష్యప్రమాదంపై గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ప్లాన్‌ (గ్రాప్‌) లాంటివి చేపట్టారు. వీటిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, సంస్థలు సమన్వయంతో సాగితేనే ఫలితం. 

అలాగే, గాలిలో నైట్రోజన్‌ డయాక్సైడ్‌ స్థాయిని పెంచుతున్న వాహన కాలుష్యానికి పరిష్కారం – వీలైనంతగా ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయించడమే. ప్రభుత్వాలు స్థానికంగా బస్‌ సర్వీసులు పెంచాలి. మెట్రో స్టేషన్లు సహా ఇతర రవాణా వసతులకు బస్‌ సర్వీసులను అనుసంధానించాలి. నడక– సైకిల్‌ వినియోగానికి ప్రాథమిక వసతులను పెంచాలి. పౌరులు సైతం ఢిల్లీ సర్కార్‌ అభ్యర్థిం చినట్టు పదుగురు కలసి ఒకే కారులో (కార్‌ పూలింగ్‌)లో పనికి వెళ్ళడం, వాహన రద్దీని నివారించేలా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఆశ్రయించడం, అనధికారిక నిర్మాణాలు – వ్యర్థాల దహనాన్ని నిరోధించడం లాంటివి అనుసరించాలి. స్థానిక సర్కార్లపైనే నెట్టేయడం కాక కేంద్ర ప్రభుత్వమూ తన బాధ్యత నిర్వర్తించాలి. సమష్టిగా చర్యలు చేపడితేనే ఫలితం. ఆ దిశగా ప్రతి అడుగూ అమూల్యమైనదే!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top