ఈసారి బలహీనమైన సారథిగా...

Editorial About Nitish Kumar Take Oath Of Bihar Chief Minister As 7Times - Sakshi

బిహార్‌ రాజకీయాల్లో క్రమేపీ బలహీనపడుతూ వస్తున్న జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్‌ సోమవారం మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గాలివాలును పసిగట్టడంలో, అందుకనుగుణంగా  నిర్ణయాలు తీసుకోవడంలో, దీర్ఘకాలం అధికారానికి అంటిపెట్టుకుని వుండటంలో నితీశ్‌ది ప్రత్యేకమైన రికార్డు. 2005తో మొదలుపెట్టి ఇంతవరకూ చూస్తే సీఎంగా ఆయనకిది నాలుగో దఫా.

కానీ అంతక్రితం 2000 మార్చిలో పదిరోజులపాటు ముఖ్యమంత్రిగా వుండటాన్ని, 2014–15 మధ్య ఒకసారి ఆ పదవికి రాజీనామా చేసి జితన్‌ రాం మాంఝీకి అప్పగించి, తిరిగి కొన్ని నెలలకే మళ్లీ సీఎంకావడం...2017లో కొన్నాళ్లు బీజేపీని వదిలి ఆర్జేడీతో జట్టుకట్టి సీఎం అయి, ఆ తర్వాత బీజేపీ శిబిరానికొచ్చి తిరిగి సీఎం కావడం వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆయన ఇప్పటికి ఏడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్టు లెక్క. నితీశ్‌కుమార్‌ వ్యక్తిత్వం తెలిసున్న కొందరు సీనియర్‌ నేతలు ఆయన ఈసారి ముఖ్యమంత్రిగా వుండటానికి ఇష్టపడరనుకున్నారు.

ఎందుకంటే ఎన్‌డీఏలో ప్రధాన భాగస్వామ్యపక్ష అధినేతగా రాష్ట్రంలో దాని నడతనూ, నడకనూ శాసించిన నాయకుడాయన. ఒక సందర్భంలో అయితే నరేంద్ర మోదీ ప్రచారానికొస్తే తాను ఎన్‌డీఏలో కొనసాగబోనని చెప్పిన చరిత్ర ఆయనది. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒక ఎన్నికల ప్రచార సభలో పౌరసత్వ సవరణ చట్టం అమలును ప్రస్తావించి, దేశభద్రతకు ముప్పు తెచ్చేవారిని దేశం నుంచి తరిమేస్తామని అన్నప్పుడు, ఆ వెంటనే స్పందించిన నితీశ్‌...ఈ దేశ పౌరులెవరినీ ఎవరూ బయటకు తరమలేరని, అలాంటి మాటలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు.

రాజకీయంగా తన సోషలిస్టు నేపథ్యానికి దెబ్బ తగులుతుందన్న సంశయం తలెత్తినప్పుడు గతంలోనూ ఆయన కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. బహుశా అందుకే ఈసారి సీఎంగా తాను కొనసాగబోనని ఎన్‌డీఏకు నితీశ్‌ చెప్పారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. బీజేపీకి తమకంటే అధిక స్థానాలొచ్చాయి గనుక, ఆ పార్టీకి చెందిన నాయకులే ముఖ్యమంత్రిగా వుంటే బాగుంటుందని ఆయన తెలిపారని ఆ కథనాల సారాంశం.

అయితే మీరే పగ్గాలు చేపట్టాలని బీజేపీ నేతలు పట్టుబట్టారని, అందువల్లే బాధ్యతలు తీసుకోవాల్సివచ్చిందని తన సన్నిహితులతో నితీశ్‌ చెప్పినట్టు ఆ కథనాలు తెలిపాయి. మొన్న ఎన్నికల్లో ఎన్‌డీఏకు 125 స్థానాలు లభించగా...ఆ శిబిరంలో బీజేపీ 74 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. జేడీ(యూ) బలం ఒక్కసారిగా 43కి పడిపోయింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు తెచ్చుకుంది. 

అయితే నితీశ్‌ బీజేపీ వినతి మేరకు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా, తనంత తానే ఆ పనిచేసినా గతంలోవలే ఆయన నిర్ణయాత్మకంగా వ్యవహరించలేరన్నది వాస్తవం. బిహార్‌లో ఎప్పుడేం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈసారి ఏలుబడిలో బీజేపీ దృఢంగా చెబుతుంది. వారు కోరుతున్నవి అమలు చేయకపోయినా, వారికి అసంతృప్తి కలిగించే నిర్ణయాలు చేసినా బీజేపీ నేతలు గతంలోవలే మౌన ప్రేక్షకుల్లా వుండే అవకాశం లేదు.

బిహార్‌లో భిన్న సామాజిక వర్గాలకు, వాటి ప్రయోజనాలకు ప్రాతినిధ్యంవహించే పార్టీల మధ్య మనుగడ సాగిస్తూ, అచ్చం ఆ పార్టీల మాదిరే కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ...అదే సమయంలో హిందుత్వనూ, తనదైన జాతీయవాద ముద్రనూ బీజేపీ కొనసాగిస్తోంది. అవి  ఆ పార్టీకి మెరుగైన ఫలితాలే ఇస్తున్నాయి. పార్టీ విస్తరణకు దోహదపడుతున్న ఈ విధానాన్నే అది కొనసాగించదల్చుకుంది. పైగా ఇటీవలికాలంలో మిత్రపక్షాలతో వచ్చిన వైరంవల్ల కలిగిన అనుభవాలు వుండనే వున్నాయి.

మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు వేర్వేరు కారణాలతో ఎన్‌డీఏకు దూరమయ్యాయి. అందుకే బిహార్‌లో ఇప్పటికిప్పుడు స్టీరింగ్‌ తీసుకోవాలన్న ఆత్రుతను బీజేపీ ప్రదర్శించదలచుకోలేదు. అలాగని కీలకమైన మంత్రిత్వ శాఖలపై, ఇతర పదవులపై అది చూసీచూడనట్టు వుండే అవకాశం లేదు. అత్యధిక స్థానాలున్న పక్షంగా ఎటూ పదవుల్లో దానికి సింహభాగం దక్కుతుంది. కీలకమైన స్పీకర్‌ పదవి బీజేపీయే తీసుకుంది.

గతంలో ఎన్నడూ ఆ పదవిని నితీశ్‌ బీజేపీకి వదల్లేదు. ఉప ముఖ్యమంత్రిగా గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్న పార్టీ నేత సుశీల్‌ మోదీని ఈసారి తప్పించి ఆయన స్థానంలో అదే బనియా కులానికి చెందిన తార్‌కిశోర్‌ ప్రసాద్‌ను ఎంపిక చేసింది. మరో ఉప ముఖ్యమంత్రిగా బిహార్‌లో అత్యంత వెనకబడిన కులంగా ముద్రపడిన నోనియా కులానికి చెందిన రేణూ దేవిని ఎంపిక చేయడం గమనించదగ్గది. మొన్న జరిగిన ఎన్నికల్లో మహిళలు భారీయెత్తున ఎన్‌డీఏకూ, ప్రత్యేకించి బీజేపీకీ ఓట్లేశారన్న సంగతిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నానుకోవాలి. అదే సమయంలో ఆధిపత్య కులానికి చెందిన మహిళనెవరినో కాక, బాగా వెనకబడిన కులానికి చెందిన మహిళను ఉప ముఖ్యమంత్రి చేయడం బీజేపీ ఎత్తుగడను తెలియజెబుతుంది. 

ఇప్పుడున్న సమీకరణాలు గమనిస్తే రాగల కాలంలో బిహార్‌ రాజకీయంగా అనేక పరిణామాలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అధికారంలో కొనసాగడానికి కావలసిన కనీస మెజారిటీ 122 కాగా ఎన్‌డీఏకు కేవలం అంతకన్నా మరో ముగ్గురు మాత్రమే అదనంగా వున్నారు. తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి బీజేపీ పావులు కదిపితే విపక్ష శిబిరం చెల్లాచెదురయ్యే అవకాశంవుంది. బీజేపీ ఈ మార్గాన్ని ఆశ్రయించి బలం పెంచుకోదల్చుకుంటే జేడీ(యూ) మౌనంగా వుంటుందా...రాజకీయ నైతికతను ముందుకు తెచ్చి అభ్యంతరం చెబుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడితే విపక్షాలకన్నా మున్ముందు జేడీ(యూ)కే అది అధిక నష్టం కలిగిస్తుంది. మొత్తానికి ఎన్‌డీఏలో జూనియర్‌ భాగస్వామిగా ఈసారి రాష్ట్రానికి నితీశ్‌ ఎలా సారథ్యంవహిస్తారో మున్ముందు చూడాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top