‘సంపూర్ణ యుద్ధం’ వికటిస్తుందా?

Assam: Bjp Govt Plans Rehabilitation Policy For Victims Amid Crackdown On Child Marriage - Sakshi

ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా బడి ఈడు పిల్లలను పెళ్లి పీటలెక్కించే సామాజిక దురాచారం దేశంలో పెద్దగా తగ్గలేదని తరచు వెలుగులోకొస్తున్న ఉదంతాలు చెబుతున్నాయి. బాల్యవివాహాలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా వారం క్రితం ప్రకటించిన ‘సంపూర్ణ యుద్ధం’ ఈ సమస్యను మరోసారి ఎజెండాలోకి తెచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై ప్రకటన చేసిందే తడవుగా ఆ రాష్ట్రంలో పోలీసులు విరుచుకుపడటం మొదలెట్టారు. ఇంతవరకూ దాదాపు మూడువేలమందిని అరెస్టు చేశారంటున్నారు. వీరిలో పెళ్లిళ్లు జరిపించిన పురోహితులు, కాజీలు కూడా ఉన్నారు.

అరెస్టయినవారిలో అత్యధికులపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) కింద వేర్వేరు సెక్షన్లు నమోదు చేయటంతోపాటు పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని కూడా ప్రయోగించారు. వాస్తవానికి దాదాపు పదివేలమందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా వారిలో చాలామంది పరారయ్యారు. ఈ పోలీసు చర్యకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు గమనించదగ్గవి. 2019–20 మధ్య జరిపిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అస్సాంలో 20–24 ఏళ్ల మధ్య ఉన్న వివాహితల్లో 31.8 శాతంమంది చట్టవిరుద్ధంగా 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు చేసు కున్నవారే. జాతీయ స్థాయి సగటు 23.3 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువే. హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్‌లో అస్సాంలోని ఏయే జిల్లాల్లో ఈ బాల్యవివాహాల దురాచారం ఎక్కువుందో, దానివల్ల ఆ ప్రాంతాల్లో చిన్న వయసులోనే గర్భిణులవుతున్నవారి శాతం ఎంతో వివరించారు. టీనేజ్‌ తల్లుల, గర్భిణుల జాతీయ స్థాయి సగటు 6.8 శాతం ఉంటే, అస్సాంలో అది 11.7 శాతం. ఇది కూడా
ఆందోళనకరమైనదే.

ఎడాపెడా సాగుతున్న ఈ అరెస్టుల వల్ల తాత్కాలికంగా అలాంటి పెళ్లిళ్లకు బ్రేక్‌ పడొచ్చు. కానీ వీటికి దారితీస్తున్న మూలకారణాలను పరిష్కరించనంతవరకూ అవి పూర్తిగా సమసిపోవటం సాధ్యం కాదని పాలకులు గుర్తించటం అవసరం. విద్యాగంధం అంటని మారుమూల పల్లెలు అస్సాంలో కోకొల్లలు. నామమాత్రంగానైనా పాఠశాలలున్నచోట చదువుకునే బాలికల శాతం తక్కువ. ఆడపిల్లలకు చిన్నవయసులో పెళ్లి చేస్తే అది వారికి రక్షణగా ఉంటుందని భావించే కుటుంబాలకు కొదవలేదు. దశాబ్దాల నిర్లక్ష్యం పుణ్యమా అని మన దేశంలో గ్రామీణ మహిళల్లో చదువు కున్నవారి సంఖ్య స్వల్పం. గ్రామీణ అస్సాంలో 74 శాతంమంది మహిళలు పట్టుమని పదేళ్లు కూడా బడి చదువులకు పోలేదంటే ఏమనుకోవాలి? ఆడపిల్లకు చదువు చెప్పిస్తే ఆమెకు ఉజ్వల భవిష్యత్తుంటుందన్న అవగాహన  కలుగుతుందా? నిరక్షరాస్యతతోపాటు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, బాలి కల రక్షణ, భద్రతలపై ఉండే దిగులు, ఇతర సామాజిక దురాచారాలు బాల్యవివాహాలకు కారణమవుతున్నాయి.

ఈ సమస్యల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కేవలం పోలీసుల సాయంతో బాల్య వివాహాలను అరికట్టాలనుకోవటం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రోత్సాహాలనందిస్తే బడికొచ్చే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్లు మొదలుకొని ఉపాధ్యాయుల నియామకం వరకూ శ్రద్ధ తీసుకుంటే నాణ్యమైన విద్య అందటంతోపాటు ఆడపిల్లలు సురక్షితంగా చదువుకోవటం వీలవుతుందన్న భరోసా కుటుంబాలకు కలుగు తుంది. కానీ నీతి ఆయోగ్‌ ‘హేతుబద్ధీకరణ’ సూచనతో నిరుడు సెప్టెంబర్‌లో అస్సాంలో 1,700 స్కూళ్లు మూసివేయటమో, సమీప పాఠశాలలతో విలీనం చేయ టమో చేశారు. ఈ స్థితిలో ఆడపిల్లలను ఎక్కడో దూరంలో ఉన్న బడికి పంపటానికి తల్లిదండ్రులు సిద్ధపడతారా? ఇక ఉన్నత పాఠశాలల విషయానికొస్తే అస్సాంలో మారుమూల ప్రాంతాల్లో అవి చాలా తక్కువ.

ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్తే తప్ప చదువుకోవటం సాధ్యంకాదు. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లకు ప్రమాదం ఎదురుకావొచ్చన్న భయంతో సహజంగానే కుటుంబాలు ఇక వారి చదువుకు స్వస్తిచెబుతాయి. ఇలా బడి మానేసిన పిల్లలకు ఇక పెళ్లే ప్రత్యామ్నాయంగా మారుతోంది. చిన్న వయసులో పెళ్లిళ్లయి గర్భందాల్చిన కారణంగా ఆడపిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. గర్భస్రావాలు తప్పడం లేదు. గర్భం నిలబడినా తక్కువ బరువుతో జన్మించటం, మృత శిశు జన నాలు, పుట్టిన శిశువులు కొన్ని వారాలలోపే మరణించటం వంటివి అధికంగా ఉంటున్నాయి. ఇరవై య్యేళ్ల వయసు తర్వాత పెళ్లయ్యే బాలికలకు జన్మించే శిశువులకంటే, అంతకన్నా తక్కువ వయసు వారికి పుట్టిన శిశువుల్లో మరణాలు 50 శాతం ఎక్కువని యునిసెఫ్‌ నివేదిక చెబుతోంది. 

బాల్యవివాహాలను తక్షణం అరికట్టవలసిన సామాజిక సమస్యగా గుర్తించటం బాగున్నా,అందుకోసం అస్సాం ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇందువల్ల ఆ సమస్య మరింత జటిలమవుతుందే తప్ప తగ్గదు. ఇప్పుడు వేలాదిమంది అరెస్టయిన పర్యవసానంగా మగదిక్కులేక, రోజు గడవటం ఎలాగో, తిండితిప్పలకు ఏంచేయాలో తెలియక మహిళలు అవస్థలు పడుతున్నారు. బాల్యవివాహాలను అరికట్టడానికి ఆల్‌ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ వంటివి చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గటంలేదు. అలాంటి సంస్థలకు చేయూతనందించటం... పేదిరిక నిర్మూలనకూ, విద్యారంగం పటిష్టతకూ అవసరమైన పథకాలు అమలు చేయటం ముఖ్యమని అస్సాం ప్రభుత్వం గుర్తించాలి. ఒక సామాజిక సమస్యను నేరపూరితం చేయటం వల్ల జైళ్లు నిండుతాయి తప్ప ఫలితం శూన్యం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top