సాక్షి, రాజమహేంద్రవరం: పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వార్డుల పునర్విభజనపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పెరిగే వార్డుల వివరాలను క్రోడీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. అయితే సందట్లో సడేమియాలా చంద్రబాబు ప్రభుత్వం తమకు అనువైన వార్డుల్లో ఉన్న ప్రజలను మరో వార్డులో చేర్చించి అక్కడ కూడా పట్టు సాధించేందుకు ఈ పునర్విభజనను ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం. 2011 జనాభా లెక్కల మేరకు పునర్విభజన చేపట్టనున్నారు. 1,100 మంది ఓటర్లకు తగ్గకుండా వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. వార్డు వివరాలు ప్రచురించిన అనంతరం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని వార్డుల విభజనను ఆమోదిస్తారు. విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే వార్డుల మ్యాపింగ్ విషయం గెజిట్లో ప్రచురిస్తారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. మూడు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం 81 వార్డులు ఉండగా.. 96 వార్డులుగా పునర్విభజించనున్నారు. అంటే అదనంగా మరో 15 వార్డులు పెరగనున్నాయి. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు రాజమండ్రి రూరల్‌లోని పలు వార్డుల విలీనం ప్రక్రియ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండటంతో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది.
విభజన చేస్తారిలా?
మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. మున్సిపాటిలీ కేంద్రంలో 30,000 జనాభా ఉంటే 23 వార్డులుగా విభజిస్తారు. 40 వేల జనాభాకు 28 వార్డులు, 50 వేల జనాభాకు 32 వార్డులు, 60 వేల జనాభా ఉంటే 36 వార్డులుగా విభజిస్తారు. 80 వేల జనాభా ఉంటే 40 వార్డులు, లక్షలోపు జనాభా ఉంటే 44 వార్డులు, లక్షకు పైగా జనాభా ఉంటే 52 వార్డులుగా విభజిస్తారు.
నిడదవోలు
నిడదవోలు పట్టణంలో 2011 జనాభా లెక్కల మేరకు 43,098 వేల మందికి పైగా ఉండగా ప్రస్తుతం 28 వార్డులు ఉన్నాయి. 33 వేల మంది ఓటర్లున్నారు. వీటిని 32 వార్డులుగా పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంటే అదనంగా 4 వార్డులు పెరగనున్నాయి.
మండపేట
మండపేట మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 54,000 మంది ఉన్నారు. 2021 ఎన్నికలకు ఆ జనాభా ఆధారంగానే వార్డు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు 80 వేల జనాభా నివసిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం 21 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం 30 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో మరో ఆరు వార్డులు పెరిగి 36కి విస్తరించనుంది.
కొవ్వూరు
కొవ్వూరు పట్టణంలో ప్రస్తుతం 40,000 జనాభా ఉంది. 23 వార్డులు ఉండగా.. మరో 5 పెరగనున్నాయి.
కౌన్సిలర్లకు అవకాశం
వార్డు పెంపుతో మరికొంత మంది కౌన్సిలర్లకు రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం దక్కనుంది. ప్రతి కొత్త వార్డుకు ఒక కొత్త నాయకత్వానికి అవకాశం దక్కుతుంది. ఏ ప్రాంతాలు ఏ వార్డులోకి వెళ్తాయన్న అంశం కీలకం కానుంది. సామాజిక వర్గాల ప్రాబల్యం, ఓటర్ల సంఖ్య ఆధారంగా పార్టీలు తమ వ్యూహాలను రచించాల్సి ఉంటుంది.
స్థానిక ఎన్నికల్లో ప్రభావం
వార్డుల పునర్విభజన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తమకు అనువైన వార్డుల్లో ప్రజలను మరో వార్డులో చేర్చి అక్కడ పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
రాజమహేంద్రవరం ఏరియల్ వ్యూ
కార్పొరేషన్‌కు బ్రేక్
రాజమహేంద్రవరంలో ప్రస్తుతం 42 వార్డులున్నాయి. సుమారు 5 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మరో 8 వార్డులు ఉన్నాయి. ఇవి రెండు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని 8 వార్డులను సిటీ నియోజకవర్గంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉంది. ఈ విషయంలో టీడీపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య డిమాండ్ చేస్తుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని వాసు కోరుతున్నారు. ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ పడుతూ వస్తోంది. ప్రస్తుతం వార్డుల పునర్విభనజనకు బ్రేక్ పడింది. న్యాయస్థానంలో విలీన అంశం కొలిక్కి వస్తే తప్ప విభజన ప్రక్రియ జరగదు.
మున్సిపాలిటీల్లో పెరగనున్న వార్డులు
జిల్లాలో ఒక కార్పొరేషన్,
మూడు మున్సిపాలిటీలు
కోర్టు వివాదాలతో రాజమహేంద్రవరం
కార్పొరేషన్‌లో యథాతథ స్థితి
మున్సిపాలిటీల్లో పెరగనున్న వార్డులు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కమిషనర్లు
పునర్విభజనను అనుకూలంగా మార్చుకుంటున్న బాబు సర్కారు


