సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో గృహ అవసరాలు, అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని జేసీ మేఘ స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12 వేల నుంచి 12,500 వరకూ గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతోందన్నా రు. గ్యాస్ పంపిణీ దారుల వద్ద సుమారు 14,362 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సాధారణంగా రోజుకు 11 వేల నుంచి 11,500 వరకూ బుకింగ్‌లు ఉండేవని, అవి ప్రస్తుతం 8 వేల నుంచి 9 వేలకు తగ్గాయని పేర్కొన్నారు. ఇటీవల బుకింగ్‌లు సుమారు 90 శాతం పెరగడంతో ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందస్తు విధానంలో కొనసాగుతుండటంతో సరఫరాలో కొంత జాప్యం కనిపించిందన్నారు. సిలిండర్లను వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేస్తున్నందున గోడౌన్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్ 80746 61259కు వచ్చిన 220 ఫిర్యాదులను పరిష్కరించామని, గత కొన్ని రోజులుగా 47 కేసులు నమోదు చేసి 119 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాస్ హోర్డింగ్, నల్ల బజారు, అధిక ధరలకు అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 208 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు.


