ఈపీడీసీఎల్‌ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఈపీడీసీఎల్‌ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Mar 9 2026 7:27 AM | Updated on Mar 9 2026 7:27 AM

కాలిపోయిన స్క్రాప్‌ మీటర్లు

సిబ్బంది, స్థానికుల సహాయంతో

మంటలు ఆర్పిన ఫైర్‌ సిబ్బంది

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరు ఏపీ ఈపీడీసీఎల్‌ జిల్లా స్టోర్‌ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మీటర్ల స్క్రాప్‌ అగ్నికి ఆహుతైంది. సిబ్బంది, స్థానికులు స్పందించడంతో పాటు, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు అవసరమైన సామగ్రి ఈ కేంద్రంలో నిల్వచేస్తారు. జిల్లా వ్యాప్తంగా స్టోర్‌ పరిధిలో తొలగించిన విద్యుత్‌ మీటర్ల స్క్రాప్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలముకున్నాయి. సిబ్బందితో పాటు స్థానిక సమాచారం అందుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు కృషి చేసినా ఫలించకపోవడంతో స్థానికంగా ఉన్న రెండు శకటాలతో పాటు అనపర్తి, కొవ్వూరు, జేగురుపాడు జీవీకే, ఓఎన్‌జీసీ రెండు అగ్నిమాపక వాహనాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

కాగా ఈ ప్రమాదంలో కుప్పగా పోసిన స్క్రాప్‌ మీటర్లలో సగానికి పైగా కాలిపోగా మిగిలిన వాటిని పొక్లెయిన్‌తో పక్కకు తొలగించారు. వీటికీ మంటలు వ్యాపించి ఉంటే పక్కనే ఉన్న మంచి మీటర్ల గొడౌన్‌కు నిప్పు అంటుకుని రూ.కోట్లలో నష్టం జరిగేదని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే ఎస్‌ఈ తిలక్‌కుమార్‌, ఈఈ నక్కపల్లి శామ్యూల్‌, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మత్సేటిప్రసాద్‌, బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఈ తిలక్‌కుమార్‌ మాట్లాడుతూ సిబ్బంది స్థానికుల సహకారంతో మంటలను అదుపుచేయగలిగామన్నారు.

ఓవర్‌ లోడ్‌ వలనే...

ట్రాన్స్‌ ఫార్మర్‌ ఓవర్‌లోడ్‌ వల్ల మంటలు వ్యాపించి కింద ఉన్న తుక్కు అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించాయని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురై ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంలో సహకరించి అధికారుల మన్ననలు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement