నేడు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. ఈ ప్రదర్శన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రదర్శనను తిలకించడానికి జిల్లాలోని విద్యార్థులను సంబంధిత ప్రధానోపాధ్యాయులు సరైన రక్షణతో తీసుకురావాలని సూచించారు. మొత్తం 290 ఎగ్జిబిట్లను ఇందులో ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డీవైఈఓ దిలీప్‌కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్‌ఎస్ నెహ్రూ, పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సత్యసాయి గురుకులం ప్రిన్సిపాల్ గుర్రయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ధోరణితో ప్రభుత్వ విద్య బలహీనం
తాళ్లపూడి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ ధోరణులతో ప్రభుత్వ విద్య రోజు రోజుకూ బలహీనపడుతోందని, ఈ విధానాలను తిప్పికొట్టాలని ఉపాధ్యాయులకు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని బల్లిపాడులోని కార్ల రామయ్య ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాలుగో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని, యూటీఎఫ్, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) జెండాలను ఆవిష్కరించారు. పలు ఉద్యమ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వలన పేద ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వ ధోరణుల వల్ల రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులు ఏమైపోతాయోననే ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, నాయకులు షరీఫ్, డి.మనోజ్, ఎన్.అరుణ కుమారి తదితరులతో పాటు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
98 శాతం మందికి
పోలియో చుక్కలు
రాజమహేంద్రవరం రూరల్: పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం ఆదివారం విజయవంతంగా జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని కంబాలపేట, ఆనంద్ నగర్, క్వారీ మార్కెట్ వద్ద ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 1,89,550 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలన్నది లక్ష్యం కాగా.. ఒక్క రోజులో 1,85,759 మందికి (98 శాతం) వేశామని తెలిపారు. మిగిలిన పిల్లల ఇళ్లకు వైద్య సిబ్బంది సోమ, మంగళవారాల్లో వెళ్లి పోలియో చుక్కల మందు వేస్తారని వెంకటేశ్వరరావు వివరించారు.
నేడు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నేడు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన


