
కమిషనర్ లేక పాలన అస్తవ్యస్తం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం సిటీ): ఐదు నెలలుగా రాజమహేంద్రవరరం నగర పాలక సంస్థకు కమిషనర్ లేకపోవడంతో పాలన ముఖ్యంగా శానిటేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారైందని ఏఐటీయూసీ జిల్లా నాయకులు తాటిపాక మధు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద నగరపాలక సంస్థకు కమిషనర్‌ని నియమించాలని మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ విభాగంలో చనిపోయిన కార్మికుల స్థానంలో వారి వారసులను ఉద్యోగాల్లో నియమించాలని, 60 ఏళ్లు నిండిన ఔట్ సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి మధు మాట్లాడుతూ రాజమహేంద్రవరం లాంటి చారిత్రక నగరానికి కమిషనర్‌ని నియమించడానికి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు ఒకపక్క రానున్న గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయని అయినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులకు సమస్యలు ఉంటాయని ప్రతిసారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి అధ్యక్షుడు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నేతలు తాటిపాక మధు