
మాలధారణం.. నియమాల తోరణం
కొత్తపేట: పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్షకు ‘మాలధారణం.. నియమాల తోరణం’ అంటూ భక్తులు శ్రీకారం చుట్టారు. పలుచోట్ల భక్తులు శుక్రవారం మాల ధరించి దీక్షలు ప్రారంభించగా, మరికొన్ని చోట్ల ఆదివారం మాల ధరించనున్నారు. ఎక్కువగా అయ్యప్ప స్వామి దీక్షలు దసరా రోజుల్లో లేదా విజయ దశమి అనంతరం ప్రారంభిస్తారు. దీనిని మండల దీక్ష అంటారు. 41 రోజుల అనంతరం దీక్ష ముగించి, ఇరుముడులతో శబరిమలకు పయనమవుతారు. అలాగే కార్తికమాసంలో కూడా అనేక మంది దీక్షను ప్రారంభిస్తారు. దీనిని జ్యోతి దర్శన దీక్ష అంటారు. మకర సంక్రాంతికి ముందు దీక్షను ముగించి జ్యోతి దర్శనానికి వెళతారు. 41 రోజుల పాటు కఠిన నియమాలతో దీక్షను ఆచరిస్తారు.
అయ్యప్ప మాలధారణ నియమాలు
మాల ధారణ అనేది అయ్యప్పను దర్శించడానికి భక్తులు చేపట్టే కఠినమైన 41 రోజుల వ్రత దీక్ష. ఈ దీక్షలో భక్తులు పవిత్రత, బ్రహ్మచర్యం, శాఖాహారం మాత్రమే తీసుకునే కఠినమైన నియమాలను పాటిస్తూ, రుద్రాక్ష లేదా, తులసి, స్పటిక పూసలతో చేసిన మాలలు, నల్లని లేదా నీలం దుస్తులు ధరిస్తారు. చెప్పులు లేకుండా నడవడం, రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా నదీ స్నానం లేదా చల్లటి నీటితో స్నానం చేయడం, కటిక నేలపై నిద్రించడం వంటి నియమాలు పాటిస్తారు. ఈ దీక్ష సమయంలో దైనందిన జీవితానికి, భౌతిక సుఖాలకు దూరంగా, కఠిన నియమాలు పాటించడం ద్వారా, భగవంతునిపై భక్తిని, అంకితభావాన్ని, క్రమశిక్షణతో ఆధ్యాత్మిక సాధన చేస్తూ.. అయ్యప్పస్వామిని దర్శించడానికి తమను తాము మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసుకోవడమే వ్రత దీక్ష ముఖ్యోద్దేశం.
జిల్లాలో అయ్యప్ప ఆలయాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో అయ్యప్పస్వామి ఆలయాలున్నాయి. ద్వారపూడిలో అయ్యప్పస్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఆంధ్ర శబరిమలగా పిలుస్తారు. కొత్తపేట మండలం వాడపాలెం అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కోనసీమ శబరిమలగా విరాజిల్లుతోంది. రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ సమీపాన, కాకినాడ, సామర్లకోట, తుని, అమలాపురం, మండపేట, కొత్తపేట, వాడపాలెం, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజోలు, అనపర్తి, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి ఆలయాలున్నాయి. ఏటా భక్తులు ఆయా ఆలయాల్లో గురుస్వాముల చేతుల మీదుగా మాలను ధరించి, దీక్ష ప్రారంభిస్తారు. కొత్తపేట మండలం వాడపాలెం అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయం వద్ద ఏకాదశి సందర్భంగా శుక్రవారం సుమారు 130 మంది అయ్యప్ప మాల ధరించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల మంది భక్తులు మాల ధరిస్తారని అంచనా. 41 రోజుల అయ్యప్ప దీక్ష అనంతరం గురుస్వాముల చేతుల మీదుగానే ఇరుముడులు కట్టించుకుని శబరిమల పయనమవుతారు. శబరిమల వెళ్లలేని భక్తులు ద్వారపూడి వెళ్లి దీక్షను ముగిస్తారు.
స్వాములకు సుభిక్ష
కఠినమైన అయ్యప్ప దీక్షలో మాల ధరించింది మొదలు, దీక్ష పూర్తయ్యే వరకూ ఏకభుక్తం (ఒక్క పూట భోజనం) మాత్రమే చేయాలి. ఇంట్లో అన్ని రోజులూ నియమాలతో ఆహారం తయారుచేయడం కుదరదు. చాలా మంది భక్తులు బృందంగా ఏర్పడి స్వయంగా వండుకుంటారు. అలా కుదరని వారు ప్రత్యేకంగా మడిగా ఉండే వంట మనుషులతో ఉదయం, రాత్రి వడి (అల్పాహారం), మధ్యాహ్నం భిక్ష (భోజనం) చేయించుకుని స్వీకరిస్తారు. మరికొందరు స్వామిపై భక్తితో మాల ధరిస్తారు. వారికి మడిగా వడి, భిక్ష తయారుచేసుకునే అవకాశం ఉండదు. ఉద్యోగ, ఉపాధి, వివిధ పనులపై దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి వారు భిక్ష లేక ఆ పూట ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం వడి, భిక్ష దాదాపు అన్ని అయ్యప్ప ఆలయాల్లో అందిస్తున్నారు.
ద్వారపూడి అయ్యప్పస్వామి ఆలయం
కొత్తపేట మండలం వాడపాలెం ఆలయంలో భిక్ష స్వీకరిస్తున్న స్వాములు
వాడపాలెంలో
ఉచిత భిక్ష ప్రారంభం
కొత్తపేట మండలం వాడపాలెం అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా అయ్యప్ప మాలధారులకు ఉచిత భిక్ష (అన్న ప్రసాదం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు కూడా ఇందుకు సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భిక్ష ప్రారంభించారు. తొలిరోజు సుమారు 150 మంది భిక్ష స్వీకరించారు. కొత్తపేట బోడిపాలెం వద్ద గౌతమి అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి భిక్షను ప్రారంభించనున్నారు. సుమారు 250 మంది భక్తులు భిక్ష స్వీకరిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.
గ్రామగ్రామానా అయ్యప్ప స్వామి
భక్తుల మండల దీక్ష ప్రారంభం
కఠిన నియమాలతో నిర్వహణ
14న ఇరుముడులతో శబరిమల పయనం
స్వాములకు ఉచిత భిక్ష

మాలధారణం.. నియమాల తోరణం