అస్మదీయులకే సంపద సృష్టి | - | Sakshi
Sakshi News home page

అస్మదీయులకే సంపద సృష్టి

Jul 13 2025 7:31 AM | Updated on Jul 13 2025 7:31 AM

అస్మద

అస్మదీయులకే సంపద సృష్టి

టీడీపీ నేతల చేతుల్లోకి ఎఫ్‌సీలు

కాకినాడ, రాజానగరం ఏటీఎస్‌లు వారికే..

గతంలో రవాణా శాఖ పరిధిలోనే

ఎఫ్‌సీల జారీ

నేడు ప్రైవేటీకరించడంపై సర్వత్రా నిరసన

సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే మద్యం, ఇసుకను కట్టబెట్టడంతో కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఈ శాఖలో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల (ఎఫ్‌సీ) జారీ సేవలను టీడీపీ నేతలకు చెందిన ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఎఫ్‌సీల జారీలో రాష్ట్ర రవాణా శాఖను డమ్మీగా చేసేశారు. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఇప్పటి వరకూ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు ఎఫ్‌సీలు జారీ చేసేవారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ ప్రకారం చలానా కట్టించుకుని ఎఫ్‌సీ మంజూరు చేసేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లైట్‌, హెవీ మోటార్‌ వెహికల్స్‌కు ఎఫ్‌సీల జారీ చేసే పనిని తాజాగా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీనిపై ఎవ్వరికీ అజమాయిషీ ఉండదు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు.

చక్రం తిప్పిన కీలక మంత్రి!

కొత్త విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) మంజూరు చేశారు. తొలి దశలో 15 ఏటీఎస్‌లు ప్రారంభించారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సింహభాగం సెంటర్లను కై వసం చేసుకున్నారు. అది కూడా యువగళం పాదయాత్ర చేసిన వారికే దక్కాయి. దీని వెనుక కీలక మంత్రి ఒకరు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ, రాజానగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచినట్లు తెలిసింది.

రూ.కోట్లు కొల్లగొట్టేలా..

ఒక ఏటీఎస్‌ ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం ఏకంగా రూ.3 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.2 కోట్లు మాత్రమే ఆ ప్రైవేటు సంస్థ వెచ్చించాలి. ఎఫ్‌సీల జారీ ద్వారా ప్రతి జిల్లాలో రూ.కోట్లు వసూలవుతాయి. కేంద్ర ట్రాన్స్‌పోర్ట్‌ ఇండియా సలహా మేరకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ల ద్వారా రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్మును ఆ సంస్థ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక పైసా కూడా చెల్లించనవవసరం లేదు. అటువంటప్పుడు ఆ సంస్థకు సబ్సిడీ ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలూ కలిపి సుమారు 1.80 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 లక్షల వాహనాలు ఎఫ్‌సీ కోసం వస్తూంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎఫ్‌సీల జారీని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ప్రభుత్వ ఆదాయానికి ఆమేరకు గండి పడింది. మరోవైపు ఎఫ్‌సీల జారీని ప్రైవేటు సంస్థకు ఏకంగా 20 ఏళ్లకు రాసివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకే కూటమి ప్రభుత్వం ఇలా దీర్ఘకాలిక లీజులు ఇస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

మళ్లీమళ్లీ చలానాలు

ఎఫ్‌సీ పొందేందుకు తొలుత సంస్థ నిర్దేశించిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. అనంతరం నిర్దేశించిన సమయంలోగా వాహనాన్ని తనిఖీ చేయించుకోవాలి. లేదంటే తిరిగి చలానా తీయాల్సి వస్తోంది. గతంలో చలానాకు వారం నుంచి 15 రోజుల వరకూ గడువుండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాహనదారులు వాపోతున్నారు. పైగా గతంలో కంటే చలానా మొత్తాన్ని భారీగా పెంచారని మండిపడుతున్నారు. గతంలో వాహనంలో చిన్నపాటి లోపాలుంటే సరిచేసుకుని వస్తే ఎఫ్‌సీ ఇచ్చేవారు. ప్రస్తుతం బ్రేక్‌ ఆయిల్‌ తక్కువగా ఉండటం చిన్నపాటి లోపాలున్నా అన్‌ఫిట్‌ చేసేస్తున్నారు. ఆ విషయం వారం తర్వాత మెసేజ్‌ ద్వారా తెలుస్తోంది. అప్పటికే చలాగా గడువు ముగిసిపోతూండటంతో మళ్లీ కట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగి రూ.వేలు వసూలు చేస్తున్నారు.

దూరాభారం

ఏటీఎస్‌లను జిల్లా కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రాజానగరం వద్ద ఏటీఎస్‌ పెట్టారు. నల్లజర్ల నుంచి రాజానగరం వచ్చి వెళ్లాలంటే రాను పోను 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది దూరాభారమవుతోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. దీనివలన పనులు మానుకుని రావాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆటో, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు వాపోతున్నారు. ఎఫ్‌సీల జారీని ప్రైవేటీకరించడంపై మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌, వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్‌ ప్రసాద్‌ తదితరుల ఆధ్వర్యాన రవాణా కార్మికులు రాజానగరం ఏటీఎస్‌ వద్ద ఇటీవల నిరసన తెలిపారు.

చలానాల పెంపు (రూ.లు)

వాహనం పాత కొత్త బాదుడు

చలానా చలానా

లారీ 920 1,320 400

మినీ వ్యాన్‌ 920 1,320 400

ఎల్‌ఎంవీ 720 920 200

ఆటో 620 820 200

జిల్లాలో వాహనాలు

వాహనం సంఖ్య

ద్విచక్ర వాహనాలు 3,41,117

కార్లు 45,404

ఆటో 21,726

గూడ్స్‌ క్యారియర్లు 20,465

ట్రాక్టర్లు 7,807

ట్రాలీలు 4,896

త్రీ వీలర్‌ గూడ్స్‌ వాహనాలు 3,599

ట్రైలర్‌ (అగ్రికల్చర్‌) 2,306

స్కూల్‌, కాలేజీ బస్సులు 1,827

లగ్జరీ టూరిస్ట్‌ క్యాబ్‌లు 342

అంబులెన్స్‌లు 230

జీపులు 150

రోడ్‌ రోలర్లు 67

పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత

కేంద్రం తీసుకు వచ్చిన ఎఫ్‌సీల జారీ ప్రైవేటీకరణ విధానాన్ని తొలుత రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో అమలు చేశారు. వాహన కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో కర్ణాటక, రాజస్థాన్‌ ప్రభుత్వాలు దీని అమలును నిలిపివేశాయి. పాత, కొత్త విధానాల్లో ఎఫ్‌సీలు చేయించుకునేలా గుజరాత్‌ వెసులుబాటు కల్పించింది. మిగిలిన రాష్ట్రాలు నూతన విధానం అమలు చేయడం లేదు. కానీ, మన రాష్ట్రంలో సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం అస్మదీయులకు సంపద సృష్టించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లుందనే విమర్శలు వస్తున్నాయి.

ఫిట్‌నెస్‌ ప్రైవేటీకరణపై పోరాటం

కార్మికులు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఫిట్‌నెస్‌ ప్రైవేటీకరణకు నాంది పలకడం దారుణం. దీనిని ఉపసంహరించుకునేంత వరకూ ఉధృతంగా పోరాడతాం. ఈ విషయంలో కార్మిక జేఏసీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్‌ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా ఉంటారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం మంచి చేసిందో కార్మికులు గ్రహించాలి. – మార్గాని భరత్‌రామ్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార

ప్రతినిధి, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం

ఉపసంహరించుకోవాలి

ఫిట్‌నెస్‌ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని తక్షణమే ఉపసంహరించాలి. చలానా విధానంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు సామర్థ్య పరీక్షలు అప్పగిస్తే పారదర్శకత ఏం ఉంటుంది? ఒక వాహనానికి పరీక్ష చేయాలంటే 40 నిమిషాలు పడుతోంది. కొన్ని పాఠశాలలు, కళాశాలలకు చెందిన వాహనాలు సెంటర్‌ వద్దకు రాకపోయినా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు.

– వాసంశెట్టి గంగాధరరావు, కార్మిక సంఘాల

ప్రతినిధుల జేఏసీ కన్వీనర్‌, రాజమహేంద్రవరం

అస్మదీయులకే సంపద సృష్టి1
1/3

అస్మదీయులకే సంపద సృష్టి

అస్మదీయులకే సంపద సృష్టి2
2/3

అస్మదీయులకే సంపద సృష్టి

అస్మదీయులకే సంపద సృష్టి3
3/3

అస్మదీయులకే సంపద సృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement