
మాణిక్యాంబా అమ్మవారికి ఆషాఢం సారె
రామచంద్రపురం రూరల్: పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 వ శక్తి పీఠంగా అలరారుతున్న ద్రాక్షారామలో మాణిక్యాంబా అమ్మవారికి భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢం సారెను అందజేశారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో శాకంబరిగా అలంకరించారు. ద్రాక్షారామకు చెందిన స్వీట్ స్టాల్ అధినేత కంచెర్ల చక్రధరరావు(చక్రి) సుమారు 150 కేజీల వివిధ రకాల స్వీట్లు అమ్మవారికి సారెగా సమర్పించారు. పలువురు మహిళా భక్తులు స్వీట్లు, పండ్లు అమ్మవారికి సారె తీసుకువచ్చారు. అమ్మవారి పుట్టిల్లు అయిన వేగాయమ్మపేట నుంచి శోభాయాత్రగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో సారెను తోడ్కొని వచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, వేగాయమ్మపేట జమీందార్ వాడ్రేవు సుందర రత్నాకరరావు, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ పాల్గొన్నారు.

మాణిక్యాంబా అమ్మవారికి ఆషాఢం సారె