
వైవిధ్య వరితం!
ప్రయోగాత్మకంగా చేపట్టాను
నేను 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలు వేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాను. ఇటీవల నీటి ఎద్దడిని అధిగమించేలా ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేసే విధానాన్ని నా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టాను. దీంతో మా పొలంలో ఒక ఎకరంలో ఈ పద్ధతిలో వరి సాగు చేశాం. దుక్కి దున్నిన పొలంలో ఎటువంటి తడి లేకుండా పొడి విత్తనాలను సాగు చేశాం.
– పాటి శ్రీనివాసు, ప్రకృతి వ్యవసాయ రైతు, వెల్దుర్తి, పిఠాపురం మండలం
పిఠాపురం: నీటి వినియోగంతో సాగయ్యే పంట కావడంతో వరికి వాతావరణ పరిస్థితులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారు పోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. దీంతో ఆరుతడి పంటగా వరిని సాగు చేసే పద్ధతికి ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో నారు నీరు లేకుండా, కూలీలతో పని లేకుండా రైతులు నేరుగా వరి సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలు అంటే కేవలం వాణిజ్య పంటలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కాని మెట్ట ప్రాంతంలో నీరు అంతగా అందని పొలాల్లో వాణిజ్య పంటలకు బదులుగా వరి సాగు చేసే విధానాన్ని అధికారులు ప్రారంభించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరుతడి పద్ధతిలో వరి సాగును ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం ఎలియాజరు నేతృత్వంలో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రారంభించారు.
నష్టాల సాగుకు చెక్ పెట్టాలని..
వర్షాలు సరైన సమయంలో కురవక పోవడం తద్వారా కాలువల్లో సాగు నీరు ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల వరి సాగు కత్తిమీద సాముగా మారింది. దీంతో నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం నిర్ణీత సమయానికి వీలు పడడం లేదు. దీనివల్ల పంటలు ఆలస్యం అవ్వడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించినా రైతులు నష్టాల పాలవుతున్నారు. వ్యవసాయం చేయడం దండగ అనే నిరాశ రైతులను ఆవహిస్తోంది. చెరువులు, కాలువలు, నీటి వనరులపై ఆధారపడి పండించే పంటలు ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అయితే కొన్నిచోట్ల భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం లేదు. దీనికి తోడు కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలకు చెక్ పెడుతూ తక్కువ పెట్టుబడితో తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి వరి సాగుకు రైతులను అధికారులు సంసిద్ధం చేశారు.
ఆరుతడితో అన్నీ లాభాలే
ఆరుతడి పద్ధతిలో సాగు చేసిన వరి.. మామూలు పంట కంటే 15 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. పంట దిగుబడి 15 శాతం పెరుగుతుంది. కూలీల ఖర్చులు అవసరం లేదు. సాగు నీటి వసతి అంతంత మాత్రమే సరిపోతుంది. దీంతోపాటు నారుమడి తయారు చేయాల్సిన అవసరం, నారు వేసే ఖర్చు లేదు. నారు తీసే ఖర్చు ఉండదు. దీనివల్ల ఎకరానికి సుమారు రూ.10 వేలు మిగులుతాయి. ఈ పంట సాగుకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. కేవలం వర్షం నీరు సరిపోతుంది. వేసవిలో దుక్కి అయిన తరువాత వర్షం పడినప్పుడు నేరుగా యంత్రాలతో ఎరువులు, విత్తనాలు పొడిగా ఉన్నప్పుడే చల్లుకోవచ్చు. అదే నారుమడి తయారీకి అయితే ఎకరానికి సుమారు 30 కేజీల విత్తనం అవసరం అవుతుంది. ఆరుతడి పంటకు అయితే కేవలం 15 కేజీల విత్తనంతో ఒక ఎకరం సాగు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 15 కేజీల విత్తనాలకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆరుతడిలో వరుసల క్రమంలో దుబ్బుకు దుబ్బుకు మధ్య దూరం సమంగా ఉండడం వల్ల గాలి,వెలుతురు బాగా తగిలి పంట దిగుబడి మామూలు దాని కంటే ఎక్కువ వస్తుంది. తెగుళ్లు అంతగా సోకే ప్రమాదం కూడా ఉండదు.
నారు, తడి లేని పంట!
ఆరుతడి పంటగా వరి సాగు
ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాత్మకంగా..
పెట్టుబడి తక్కువ ఆదాయం
ఎక్కువ వచ్చేలా కృషి
కాకినాడ జిల్లా
వెల్దుర్తిలో సాగు ప్రారంభం
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి వరి సాగు ప్రారంభించాం. వీటికి దేశీయ వరి రకాలైన నవారా, మైసూర్ మల్లిక, నారాయణ కామిణి, చిట్టి ముత్యాలు మోడల్ వేయించాం. ప్రస్తుతం నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో ఈ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చాం. ముందుగా ప్రధాన పొలంలో 400 కేజీల బయోచారు కలిపిన ఘనజీవామృతం వేయించాం. విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తనానికి విత్తనానికి మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉండేలా నాటించాం. నాలుగు వరుసలు వరి విత్తనాలు నాటిన తర్వాత ఒక వరుస ఆకుకూరలు, మళ్లీ నాలుగు వరుసలు వరి విత్తనాలు మళ్లీ కాయగూరలు 4:1 నిష్పత్తిలో నాట్లు వేయించాము. ఈ సాగు పద్ధతుల్లో ప్రధానంగా నీటిని ఆదా చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో సాగు చేయవచ్చు. విభిన్న రకాల పంటలు వేయడం వలన పురుగులు, తెగుళ్ల ఉధృతిని అరికట్టవచ్చు. ప్రధాన పంట ఆదాయంతో పాటుగా అంతర పంటల వల్ల ఆదాయం పొందవచ్చు. రైతుకి పెట్టుబడి తగ్గడంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులుగా, గో ఆధారతమైన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, వృక్ష సంబంధమైన కషాయాలు ఉపయోగించి పంటలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి తీసుకురావచ్చు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో రైతుకు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లాలో పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాం. త్వరలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసే విధంగా రైతులను సంసిద్ధం చేస్తున్నాం.
– ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా మేనేజర్, కాకినాడ

వైవిధ్య వరితం!

వైవిధ్య వరితం!

వైవిధ్య వరితం!

వైవిధ్య వరితం!