కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీరాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్‌లకు ఆదివారం కాకినాడ సెకండ్ ఏజేఎఫ్‌సీఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం కాకినాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి థర్డ్ ఏజేఎఫ్‌సీఎం కోర్టు ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.20 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. రామకృష్ణారావుపేటకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు కాగా, ఈ కేసులో ఆదివారం మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులు కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మీరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను పోలీసులు కాకినాడ సబ్ జైలుకు తరలించారు.
రైల్వే ట్రాక్‌పై
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ – రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్‌పై మృతి చెంది ఉన్నాడని రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్‌ఐ లోవరాజు ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ చొక్కా, బ్లాక్ ప్యాంట్ ఉన్నాయని, చెవికి పోగులు ఉన్నాయని చెప్పారు. పై వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉంటే సీఐ 9440627551,ఎస్‌ఐ–9491444022, నంబర్లకు తెలియజేయాలన్నారు.
ఇంటికి వెళుతూ వృద్ధుడి మృతి
బిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని రాజానగరం వెళ్లే బస్సు స్టాప్ వద్ద వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం బలభద్రపురం గ్రామంలోని రాజానగరం బస్‌స్టాప్ వద్ద గుర్తు తెలియన వృద్ధుడు మృతి చెందినట్లు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందిందన్నారు. మృతుడు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి గంపల రాముడు (79)గా గుర్తించారు. అతను అనపర్తి మండలం పులగుర్త గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నట్లు, సైకిల్‌పై ఇంటికి వెళుతూ బలభద్రపురం వచ్చిన తరువాత ఒక్కసారిగా పడిపోయి మృతి చెందినట్టు తెలిపారు. అతని కుమారుడు నానాజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్‌సీ తరలించినట్లు తెలిపారు.
ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై లైంగిక వేధింపుల కేసు
అమలాపురం టౌన్: అమలాపురం ఇరిగేషన్ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తనను ఉద్యోగ పరంగానూ, లైంగికంగానూ వేధిస్తున్నారని అదే కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ పట్టణ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి తనను డీఈఈ వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ
సీతానగరం: మండలంలోని రఘుదేవపురం రవీంద్ర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగిందని ఎస్సై డి.రామ్ కుమార్ ఆదివారం తెలిపారు. సురవరపు మణికంఠ అక్క నిడదవోలులో ఉంటున్నారు. రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి రాగా తాళం బద్దలు కొట్టి ఉంది. లోపల సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన మణికంఠ పోలీసులకు సమాచారం అందించాడు. నాలుగు కాసుల బంగారు బిస్కట్, 90 తులాల వెండి, రూ.3.90 లక్షల నగదు పోయిందని గుర్తించారు. ఎస్సై ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీను సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఆస్తి తగాదాలో ఒకరికి కత్తిపోట్లు
కరప: గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఒకరు కత్తిపోట్లకు గురికాగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కరప గ్రామం మెరకవీధిలో బేరి రామకృష్ణ కింది పోర్షన్‌లోను, బేరి రాజ రాజేశ్వరి పైపోర్షన్‌లోను నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదం జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బేరి రామకృష్ణ వియ్యంకుడు అమజాల వీరరాఘవ బిక్కవోలు నుంచి భోజనం క్యారేజీ పట్టుకుని వచ్చారు. అదే సమయంలో రాజరాజేశ్వరి ఆస్తి తగాదా విషయంపై రామకృష్ణతో గొడవ పడుతుండగా రాఘవ కూడా ఆ గొడవలో కలగచేసుకున్నారు. రాజరాజేశ్వరి కుమారుడు చంద్రశేఖర్ అక్కడకు వచ్చి రామకృష్ణ, రాఘవలతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరిని చంపాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొచ్చి రాఘవ ఎడమ చేతిపై రెండుచోట్ల నరికాడు. చుట్టుపక్కలవారు వచ్చి రాఘవను కాపాడి, చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంఎల్‌సీ స్టేట్‌మెంట్‌పై కరప ఎస్‌ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జైలుకు లైంగిక వేధింపుల నిందితులు