
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు
● స్పోర్ట్సు అథారిటీ వైస్ చైర్మన్‌కు ఫిర్యాదు
● ఫెన్సింగ్ క్రీడాకారుడు గౌతమ్‌రాజ్
సామర్లకోట: సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్ స్పోర్ట్సు కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రముఖ ఫెన్సింగ్ క్రీడాకారుడు ఎం గౌతమ్‌రాజ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్‌చైర్మన్‌కు వినతి పత్రం అందజేశానన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసే అభ్యర్థి పేరుపై మరోకరు టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారన్నారు. దాంతో స్పోర్ట్సులో కనీస పరిజ్ఞానం లేనివారు స్పోర్ట్సు కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించని వారికి నకిలీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సాఫ్ట్‌బాల్ ఆటకే పరిమితం కాకుండా ఫెన్సింగ్ ఆటలోనూ ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఫెన్సింగ్ ఆటను ముసుగు ధరించి ఆడటం వలన ఎవరు ఆడుతున్నారో తెలియడం లేదన్నారు. దీనిని ఆసరాగా తీసుకొని దందా జరుగుతోందని చెప్పారు. విద్యార్ధులను క్రీడలలో ప్రాత్సహించవలసిన ఫెన్సింగ్ అసోసియేషన్ క్రీడాస్ఫూర్తిని అణగదొక్కుతోందన్నారు. దొడ్డిదారిలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని గౌతమ్‌రాజ్ కోరారు.