
సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులపై దాడి దారుణం
సీటీఆర్‌ఐ: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు, అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామగ్రి, బంగారం, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినాపురపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి, వి.సీతామహలక్ష్మితో కలిసి మాట్లాడారు. సింగారమ్మ చింతగా పేరొందిన అది ప్రైవేటు ఆలయమే అయినప్పటికీ భక్తులు ఇటీవల భారీగా తరలివస్తున్నారని, అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని తమ చేతిలో పెట్టుకోవాలనే దురుద్దేశంతో ఏప్రిల్ 23వ తేదీ రాత్రి వట్టికూటి వీర రాఘవమ్మ, పసుపులేటి సింగారలక్ష్మిపై దాడి చేసి గృహలను, షాపులను కూల్చి వేశారని, సుమారు రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దోచుకుని పోయారని అన్నారు. గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. తాము హైకోర్టులో జూన్‌న్20న రిట్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. బాధితులు మే 26న జిల్లా కలెక్టర్‌కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. 1880 నాటి కాలంలో వారి ముత్తాత పసుపులేటి వెంకన్న, పసుపులేటి వీరరాఘవమ్మ దంపతులు చింతచెట్టు కింద వెలసిన సింగారమ్మ తల్లికి సుమారు 5 ఎకరాల అడవిని చదును చేసి ఆలయ ప్రాంగణంగా రూపొందించారన్నారు. వంశ పారంపర్యంగా ఆలయం వద్దనే నివాసాలు ఏర్పర్చుకుని పూజారులుగా, ట్రస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి గుడిని రక్షించాలని కోరుతున్నామన్నారు. వట్టికూటి దుర్గాప్రసాద్, వట్టికూటి జనార్ధనరావు, సీతామహలక్ష్మి, ఆలమూరు ధనలక్ష్మి, పసుపులేటి శ్రీ వెంకట సూర్య చక్ర ధనుష్‌కుమార్ పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ