
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
ప్రారంభించిన సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ
సామర్లకోట: పట్టణంలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాలుగేళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర ర్యాలీకి భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది భక్తులు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు తరలివచ్చారు. గురువారం సాయంత్రం శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ అంటే ఒక శక్తి అని, వారి జోలికి వస్తే మట్టి కరిపిస్తారని తెలిపారు. తిరుమల తిరుపతిలోని అలిపిరి ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా స్వామీజీ వివరించారు. హిందువులు ప్రశాంత జీవన విధానాన్ని కోరుకుంటారని అన్నారు. రామనామం భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. జై శ్రీరామ్ అని చెప్పడం ద్వారా శక్తి ఏర్పడుతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మంది శోభాయాత్రకు తరలి వచ్చారు. సీఐ ఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పిఠాపురం రోడ్డు నుంచి పెద్దాపురం రోడ్డు మీదుగా శోభాయాత్ర ర్యాలీ పెద్దాపురం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరి తిరిగి సామర్లకోట వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకు స్వామిజీ మోటారు సైకిల్‌పై కూర్చుని శోభాయాత్రలో పాల్గొన్నారు.

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర