
బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా
కాకినాడ క్రైం: బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ధూమపానం వల్ల ఎదురయ్యే అనర్థాలను వాల్‌పోస్టర్‌ల ద్వారా ప్రదర్శించాలని అన్నారు. ప్రార్థనా ప్రదేశాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత శాఖతో కలిసి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల్లో బ్యాంకు ఖాతాల్లో చిక్కుకున్న సొత్తును తిరిగి ఖాతాదారుడికి అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై చేసిన విచారణను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన పెంపొందించాలని సూచించారు. పోక్సో, రేప్ కేసుల్లో బాధితులను విచారించేందుకు శక్తి టీం సేవలను వినియోగించుకోవాలని, ఇటువంటి కేసుల్లో 60 రోజుల్లోపు చార్జిషీటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాత కేసులు, ఆస్తి తగాదాలు, పోక్సో, రేప్, ఎన్‌డీపీఎస్, సైబర్ క్రైం, మిస్సింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్‌రావు, కాకినాడ ఎస్‌డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం ఎస్‌డీపీవో హరిబాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
యువతి అదృశ్యంపై కేసు
రామచంద్రపురం రూరల్: మండలంలోని ఆదివారపుపేట గ్రామానికి చెందిన యువతి ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. ఆదివారపుపేట గ్రామానికి చెందిన పిచ్చిక సత్యవతి కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామం ఆదివారపుపేట వచ్చారు. ఈ నేపథ్యంలో 21 రాత్రి 2 గంటల సమయంలో తల్లి సత్యవతి ఇంటిలో తన కూతురు అపర్ణ లేకపోవడం గమనించింది. పరిసరాల్లోను, బంధువు ఇళ్లల్లోను విచారణ చేసినా ఉపయోగం లేకపోవడంతో ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.