
అర్ధరాత్రి కారు బీభత్సం
పిఠాపురం: స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో బుధవారం అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి మోటారు సైకిల్‌పై వెళుతున్న ముగ్గురిని ఢీకొట్టి పాదగయ ఆలయం వద్ద పార్కింగ్‌లో ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో మోటారు సైకిల్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా పలు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు బుధవారం అర్ధరాత్రి పిఠాపురం పాదగయ సెంటర్‌లో ఒకే మోటార్ సైకిల్‌పై చంద్రపాలెం పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న స్థానిక ఇందిరానగర్‌కు చెందిన పల్లా కృష్ణ, ఏడిద వెంకటేష్, బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్రను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి పాదగయ క్షేత్రం వద్ద పార్కింగ్‌లో ఉన్న పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడగా పాదగయ సెంటర్లో ఉన్న పలు మోటారు సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగంగా వచ్చి
మోటార్ సైకిలిస్టులను ఢీ కొట్టిన వైనం
ముగ్గురికి తీవ్ర గాయాలు,
ఒకరి పరిస్థితి విషమం
కారులోని వారిని కాపాడిన ఎయిర్ బెలూన్లు