
ఆగివున్న లారీని ఢీకొట్టిన టాటా వ్యాన్
ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలు
రాజానగరం: జాతీయ రహదారిపై వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన నాగుల వెంకటేశ్వరరావు, ఎన్.రాజ్యలక్ష్మి, బి.రఘుబాబు, లక్ష్మీదుర్గ, తాళం రాధ, బి.దేవిక, బి.లోకేశ్వర్రావు, బి.దేవేంద్ర, ఎన్.పావని అన్నవరానికి టాటా మేజిక్ వ్యాన్‌లో బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ వైఎస్సార్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్క ఆగివున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ చింతలచెరువు మధుతోపాటు అందులో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రమం ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, దైవ దర్శనం కోసం అన్నవరానికి బయలుదేరారని పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు డ్రైవర్ కునుకు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.