
శ్యాంబాబు మృతి మాదిగలకు తీరని లోటు
కాకినాడ సిటీ: ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. కాకినాడ మధురానగర్‌లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్యాంబాబు కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అన్నారు. అనేక సవాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం శ్యాంబాబు చేసిన ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను, శ్యాంబాబు నిలువెత్తు ఫొటోలను కుటుంబ సభ్యులతో కలసి కృష్ణమాదిగ తిలకించి ఆవిష్కరించారు. జాంబవ నిధికి కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు రూ.లక్ష చెక్కును కృష్ణమాదిగకు అందజేశారు. కార్యక్రమానికి కొండేపూడి శ్యాంబాబుమాదిగ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.