
కుట్టిందో మరణమే..
జాగ్రత్తలు అవసరం
● డెంగీ వ్యాధి బాధితులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి
● ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు (ప్లేట్‌లెట్స్) సాధారణంగా 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకూ ఉండాలి.
● తెల్ల రక్త కణాలు నాలుగు వేల నుంచి 11 వేల వరకూ ఉండాలి.
● డెంగీ జ్వరం ద్వారా రక్త కణాలు లక్ష దిగువకు పడిపోతే సత్వరమే వైద్యుడిని సంప్రదించాలి.
● ధీర్ఘకాలం తక్కువ రక్తకణాలు ఉంటే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.
● డెంగీ జ్వరం బారిన పడిన వ్యక్తి సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకుంటే రక్తకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
● తరచూ పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ఆలమూరు: రాత్రయితే చాలు పిలవని అతిథుల్లా మన ఇంటికి వచ్చి, తెల్లవార్లూ రక్తాన్ని పీల్చేసే దోమలతో పడే బాధలు అందరికీ అనుభవమే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వీటి బాధితులే. అందుకనే దోమల భారిన పడకుండా నిత్యం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే దోమలు కట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరం అత్యంత ప్రాణాంతకమైంది. నేడు జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
దోమ కాటుతో..
దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుడితే అతడి రక్తంలో వైరస్ వెంటనే ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. డెంగీ జ్వరం సోకిన వెంటనే శరీరంలోని ఎముకల్లో ఉన్న గుజ్జు తగ్గిపోయి క్రమేపీ రక్త కణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపి అంతిమంగా మరణానికి దారి తీస్తుంది. ఏడిస్ దోమల నుంచి సోకే డెంగీ వైరస్ నాలుగు రకాలుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తొలి రెండు దశల్లో జ్వర తీవ్రత రోగిపై ఒక మోస్తారు ప్రభావం చూపగా, మూడో దశలో హెమరేజిక్ జ్వరం తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. తుది దశ అయిన డెంగీ షాక్ సిండ్రోమ్ సోకితే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు పగటి సమయంలో మనుషులను కుడతాయి. మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి దోమల వృద్ధికి కారణమవుతాయి.
వ్యాధి నిర్ధారణ
డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్‌ఐవీ) పరీక్ష ద్వారా నిర్దారణ చేస్తారు. వ్యాధి సోకిన వ్యక్తికి వివిధ రక్త పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. డెంగీ జ్వరం తరచూ వస్తుంటే వైరస్ సంబంధిత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో ఉండే దోమలు కాటు వేయడం వల్ల్ల ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడిస్ దోమల తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2010 మే 16వ తేదీ నుంచి జాతీయ డెంగీ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఏటా ఆ రోజున దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దోమలతో అనేక వ్యాధులు
డెంగీ అత్యంత ప్రమాదకరం
జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం
నేడు జాతీయ డెంగీ దినోత్సవం
డెంగీ లక్షణాలు
ఆకస్మికంగా అధిక జ్వరం సంభవించడం (104 డిగ్రీలు)
తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి
తీవ్రమైన కండరాల నొప్పి
అలసట, వికారం, వాంతులు
చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం
చిగుళ్ల లేదా ముక్కు నుంచి రక్తస్రావం
మూత్రం, మలం, వాంతిలో రక్తం
శ్వాస ఆడకపోవడం
అలసిపోవడం, చిరాకు
అప్రమత్తంగా ఉండాలి
దోమకాటు వల్ల సంభవించే డెంగీ జ్వరంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో సైతం వర్షాలు కురుస్తుండటం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. జ్వర లక్షణాలు ఉంటే సత్వరమే సమీప వైద్యులను సంప్రదించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి.
– కె.స్వర్ణలత, వైద్యాధికారి, సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి, ఆలమూరు.

కుట్టిందో మరణమే..

కుట్టిందో మరణమే..

కుట్టిందో మరణమే..