
ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గామన్ బ్రిడ్జి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన దాసరపూడి సుధ (45) తన కుమారుడు చరణ్‌తో కలిసి దొమ్మేరు నుంచి కొవ్వూరుకు మోటార్ బైక్‌పై వస్తున్నారు. కొవ్వూరు అండర్ పాస్ సర్వీస్ రోడ్డుకు వచ్చేసరికీ వారిని వెనక నుంచి ఇసుక లారీ ఢీకొంది. రోడ్డుపై పడిన సుధ మీద నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. సుధ భర్త సాయికృష్ణ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు.
శశి విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
ఉండ్రాజవరం: పాలిసెట్ ఫలితాలల్లో శశి – వేలివెన్ను క్యాంపస్ విద్యార్థులు మరోసారి స్టేట్ ర్యాంకులతో ప్రభంజనాన్ని సృష్టించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ గురువారం తెలిపారు. బి.శశి వెంకట్ 120కి 120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఎం.చంద్రహర్ష 3, యు.సిరి దీపిక 13, వై.చంద్రకుమార్ 17, ఎం.దుర్గా శ్రీనిధి 19వ ర్యాంకులు సాధించారని తెలిపారు. 120కి 120 మార్కులు ఐదుగురు సాధించారని, 10 లోపు 2, 50 లోపు 11, 100లోపు 19 ర్యాంకులు వచ్చాయన్నారు. పాలిసెట్‌లో తమ విద్యార్థులు 14 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించారని వివరించారు.
ఏపీఆర్‌జేసీలోనూ సత్తా..
ఏపీఆర్‌జేసీ ఫలితాల్లోనూ శశి–వేలివెన్ను విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ అన్నారు. ఎంఈసీలో ఎం.వేదార్షిత, సీజీడీటీలో ఎస్.చరణ్, ఈఈటీలో డి.సాయి చరణ్ స్టేట్ ఫస్ట్‌లు సాధించారన్నారు. 10 లోపు 25, 50 లోపు 55, 100లోపు 65 ర్యాంకులు సాధించారని, ఏపీఆర్‌జేసీలో తమ విద్యార్థులు 17 సార్లు స్టేట్ ఫస్ట్ సాధించారని తెలిపారు. ర్యాంకర్లును శశి విద్యాసంస్ధల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ, డైరెక్టర్ ఎం.భాస్కర్, ప్రిన్సిపాల్ షేక్ షానూర్ అభినందించారు.
యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: నగరానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన వాడ్రేవు కిరణ్ (20) అవివాహితుడు. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం కిరణ్ తన స్నేహితుడు శ్యామ్‌తో కలిసి పెంపుడు కుక్కను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడకు హరీష్ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి ఆటోలో వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ కిరణ్‌ను ఆటోలో ఎక్కించాడు. అనంతరం వివాహేతర సంబంధంపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో హరీష్ తనతో తెచ్చుకున్న బీరు సీసాతో కిరణ్ గుండెల్లో పొడిచాడు. పలుమార్లు గొంతుకోసి ఆటోలోనే చంపేశాడు. మృతదేహాన్ని స్నేహితుడి సాయంతో తిమ్మాపురం సమీపంలోని నేమం వద్ద రోడ్ కం బిడ్జి వద్ద సముద్రంలోకి విసిరేశాడు. కాగా..తన కుమారుడు కనిపించడం లేదంటూ కిరణ్ తల్లి దుర్గ బుధవారం రాత్రి పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పొరుగు వారు సముద్ర తీరంలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చూసి దుర్గకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోర్టు పీఎస్ సీఐ సునీల్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారు.