
క్వారీ లారీ బోల్తా
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో గురువారం ఓ క్వారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లాటరైట్ ఖనిజాన్ని తరలించేందుకు వెళుతున్న ఆ లారీ రైతు గౌతు గంగ పొలంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ రహదారిలో లాటరైట్ ఖనిజాన్ని రవాణా చేసే లారీలే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మితిమీరిన వేగంతో వెళుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇటీవలే క్వారీ లారీ ఢీకొని గేదే మృతి చెందింది. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడ్డారు. రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఆటోను వెనుక వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల చిన్నారిని, ఇద్దరు మహిళలకు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఏలూరులో శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.